ధుంధాడ్. రాజస్తాన్‌కు అధికార కేంద్రంగా చెప్పుకునే ప్రాంతం. రాష్ట్ర రాజకీయాలకు కూడా ఒకరకంగా ఆయువుపట్టు. పైగా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ ఎక్కువ సీట్లు సాధించిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. అందుకే 32 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం కాంగ్రెస్, బీజేపీ ఈసారి కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ధుంధాడ్ ఒక్కోసారి ఒక్కో పార్టీని అందలమెక్కిస్తూ వస్తోంది. ఈసారి ఇక్కడ ఎవరు దూకుడు ప్రదర్శిస్తారన్నది
ఆసక్తికరంగా మారింది...
ధుంధాడ్ తూర్పు–మధ్య రాజస్తాన్‌లో ఉన్న ప్రాంతం. తొలుత ఇక్కడ 25 అసెంబ్లీ స్థానాలుండేవి. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం 32కు పెరిగాయి. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 11, కాంగ్రెస్ 13 సీట్లు గెలిచాయి. ఐదు సీట్లలో స్వతంత్రులు, రెండింట్లో బీఎస్పీ నెగ్గగా ఒకటి లోక్‌తాంత్రిక్ సమాజ్‌వాదీ ఖాతాలోకి వెళ్లింది. కానీ 2013లో మాత్రం బీజేపీ ఇక్కడ ఏకంగా 28 స్థానాలను గుప్పిట పట్టి కాంగ్రెస్‌ను కేవలం ఒక్క స్థానానికి పరిమితం చేసింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 2, స్వతంత్రులు ఒక సీటు గెలుచుకున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పరిస్థితి మారింది. కాంగ్రెస్ 20 సీట్లు హస్తగతం చేసుకుంది. బీజేపీ ఆరింటితో సరిపెట్టుకుంది. స్వతంత్రులు కూడా ఆరు సీట్లలో గెలవడం విశేషం. ఇక్కడి పట్టణ ప్రాంతాలు సాంప్రదాయికంగా బీజేపీకి కంచుకోటలంటారు రాజకీయ విశ్లేషకుడు నారాయణ్ బరేథ్. ఇక్కడ ఎక్కువగా ఉండే బ్రాహ్మణ, బనియా సామాజికవర్గాల వాళ్లు బీజేపీని తమ పార్టీగా భావిస్తుండటమే ఇందుకు కారణమన్నారాయన.
ధుంధాడ్‌లో పోయినసారి కాంగ్రెస్ ప్రదర్శన బాగున్నా ఈసారి మాత్రం పోటీ హోరాహోరీగా ఉండనుందని జోస్యం చెప్పారు. ‘‘అయితే ఇరు పార్టీలనూ వర్గపోరు కుంగదీస్తోంది. దాన్ని సరి చేసుకుని ప్రచారంలో దూకుడుగా వెళ్లడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్త పడేవాళ్లదే ఈసారి ధుంధాడ్‌లో పైచేయి’’అని అభిప్రాయపడ్డారు.
రాచరికపు ప్రభావం...
ధుంధాడ్ ప్రాంతంపై జైపూర్ రాజ వంశీకుల ప్రభావం చాలా ఎక్కువ. స్కూళ్లు, కాలేజీలు వంటి పలు విద్యా సంస్థలు, ఆస్పత్రులు తదితర నిర్మాణాలతో ప్రజల్లో రాజ కుటుంబం మంచి ఇమేజీ తెచ్చుకుంది. 1962 దాకా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో స్వతంత్ర పార్టీ ఆవిర్భావంతో కథ మారింది. మహరాణి గాయత్రీ దేవి సారథ్యంలో ఆ పార్టీ ప్రాబల్యం పెరిగింది. ఆ ఇమేజీని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ఈసారి రాజ వంశానికి చెందిన తమ ఎంపీ దియా కుమారిని విద్యాధర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపింది.
కుల ప్రభావం ఎక్కువ
హీరాలాల్ శాస్త్రి, తికారాం పలివాల్ రూపంలో రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన చరిత్ర ధుంధాడ్ ప్రాంతానిది. ఇక్కడ కుల సమీకరణలు చాలా కీలకంగా ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ ఉండగా గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుంటాయి. కాకపోతే గుజ్జర్లు తమ సామాజిక వర్గానికి చెందిన సచిన్ పైలట్‌కు 2018లో సీఎం అవకాశం ఇవ్వనందుకు ఈసారి కాంగ్రెస్‌పై బాగా అసంతృప్తితో ఉన్నారు. ధుంధాడ్‌లో చాలా నియోజకవర్గాల్లో గుజ్జర్ల ప్రాబల్యమున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగానే మారే అవకాశముంది. మీనా, ఎస్సీ సామాజికవర్గాల్లోనూ కాంగ్రెస్‌కు ఆదరణ ఉంది. బ్రాహ్మణ, రాజ్‌పూత్, బనియాలు బీజేపీకి ఎప్పుడూ మద్దతుగా ఉంటూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment