కెప్టెనే సీఎం
► మంత్రిగా తిరుమావళవన్
► ‘రమణ’ బాణిలో అవినీతి అంతం
► ఆ ఇద్దరికీ విశ్రాంతి ఇద్దాం
► ఓటర్లకు ప్రేమలత పిలుపు
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన సతీమణి, పార్టీ మహిళా విభాగం నేత ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపడతారని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రమణ’(ఠాగూర్) సినీ బాణిలో రాష్ట్రంలో అవినీతి అంతం సాగుతుందని స్పష్టం చేశారు.
డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న వారిలో విజయకాంత్ సతీమణి ప్రేమలత కూడా ఉన్నారు.ఆ కూటమిలోని నేతలు బహిరంగ సభలు, అప్పుడుప్పుడు రోడ్‌షోలతో ప్రజల్లోకి వస్తుంటే, ప్రేమలత మాత్రం నిర్విరామంగా రోడ్‌షోలతో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లు అత్యధికంగా ఉండే రోడ్లు, చిన్న చిన్న వీధుల్లోనూ మైక్ అందుకుని ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. నివ్వెరపోయి వినేంతగా ఆమె వాగ్ధాటి సాగుతూ ఉన్నది. డీఎంకే, అన్నాడీఎంకేలను కడిగి పారేస్తున్నారు. తాజాగా ఆమె పర్యటన సేలం, ఈరోడ్, నామక్కల్‌లలో సాగుతున్నది.
ఈ రోడ్ షోలో భాగంగా మంగళవారం ఆమె ఓటర్లను ఉద్దేశించి పలు చోట్ల ప్రసంగిస్తూ, తన భర్త, పార్టీ అధినేత విజయకాంత్‌ను పొగడ్తలతో ముంచుతూ, తదుపరి సీఎం ఆయనే అని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని ఓటర్లకు సూచించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అధినేత్రి ఏమో సెల్‌ఫోన్ ఇస్తున్నానంటూ ప్రకటించారని, అయితే, ఇక్కడ ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోన్లే అని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఆమె ఇచ్చే సెల్‌ఫోన్లు అవసరమా...అవసరమా..? అంటూ ప్రశ్నిస్తూ, వద్దు..వద్దు అని ఓటర్ల చేత సమాధానం రాబట్టారు.
రేషన్ షాపుల వద్ద మహిళలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో గంటల తరబడి నిలబడి ఉండడాన్ని చూసి ఆవేదన చెందిన కెప్టెన్ ఇంటి వద్దకే నిత్యవసర వస్తువులు అన్న అంశాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు. ఇక, టాస్మాక్‌ల వద్ద మగరాయుళ్ల బారులు తీరి ఉండడాన్ని దృష్టిలో ఉంచుకునే సంపూర్ణ మద్యనిషేధం నినాదాన్ని అందుకున్నట్టు పేర్కొన్నారు.
కెప్టెన్ అధికార పగ్గాలు చేపట్టగానే, తొలి సంతకంగా మద్య నిషేధంకు అనుకూలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. వయస్సుపై బడ్డ వాళ్లు ఇక, సీఎం కూర్చీల్లో కూర్చునేందుకు అనర్హులుగా పేర్కొంటూ, జయలలిత, కరుణానిధిలకు ఇక శాశ్వత విశ్రాంతిని ఇద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు. కెప్టె సీఎం కావడం తథ్యం అని, తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖను చేపడతారంటూ, కెప్టెన్ బ్లాక్ బస్టర్ రమణ సినీమా బాణిలో రాష్ర్టంలో అవినీతి అంతం సాగబోతోందన్నారు.