డీఎండీకేలో జోష్‌ నింపిన కెప్టెన్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎండీకేలో జోష్‌ నింపిన కెప్టెన్‌

Published Sat, Aug 26 2023 12:46 AM | Last Updated on Sat, Aug 26 2023 11:04 AM

పార్టీ నాయకులు, అభిమానులకు అభివాదం చేస్తున్న విజయకాంత్‌  - Sakshi

పార్టీ నాయకులు, అభిమానులకు అభివాదం చేస్తున్న విజయకాంత్‌

సాక్షి, చైన్నె: సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ శుక్రవారం 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. చాలా కాలం తర్వాత ఆయన జనంలోకి వచ్చారు. ఆయన్ను చూడగానే డీఎండీకే నాయకులు సంతోషంతో మునిగిపోయారు. విజయకాంత్‌ సినీ, రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ తన భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయకాంత్‌ను చూడలేకపోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్‌కు ఆయన జన్మదిన వేడుక అవకాశం కల్పించింది. తన బర్త్‌డే సందర్భంగా ఇంటి నుంచి విజయకాంత్‌ బయటకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో కేడర్‌ ముందు ప్రత్యక్షం అయ్యారు.

ఆనందోత్సాహం
కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయంలో విజయకాంత్‌ వచ్చారు. వీల్‌ చైర్‌ మీద నుంచే ఆయన కేడర్‌ ముందుకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున డీఎండీకే శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కాయి. విజయకాంత్‌ను చూడగానే కరుప్పు ఎంజీఆర్‌ అన్న నినాదాలు మార్మోగాయి. ఆయనతో ఫొటోలు దిగేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎగబడ్డారు. డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌తో పాటుగా ముఖ్య నాయకులు రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.

పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. విజయకాంత్‌ తనయుడు విజయ్‌ ప్రభాకరన్‌, షణ్ముగ పాండియన్‌ వచ్చిన వారందర్నీ ఆహ్వానించారు. విజయకాంత్‌తో అందరూ ఫొటోలు దిగేందుకు వీలు కల్పించారు. అలాగే, తన బర్త్‌డే కేక్‌ కట్‌ చేసిన విజయకాంత్‌ తన వారసుడు షణ్ముగ పాండియన్‌ నటించనున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. విజయకాంత్‌కు సీఎం స్టాలిన్‌, విశ్వనటుడు కమల్‌తో పాటు పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement