చెన్నై: డీఎండీకే అధినేత, సినీ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందకిపైగా చిత్రాలతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే.. విజయ్ కాంత్ అటు సినీ రంగం ద్వారా యాక్షన్ హీరోగానే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ సొంత పార్టీ డీఎండీకే ద్వారా సంచలనాలు కేరాఫ్‌గా నిలిచారాయన. తద్వారా కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాదిరే.. విజయ్‌కాంత్ తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.
తన రాజకీయ ప్రస్థానంలో విజయకాంత్ రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2005 సెప్టెంబర్‌లో విజయ్‌కాంత్ డీఎండీకే(దేశీయ మర్పోక్కు ద్రావిడ కజగం) పార్టీని స్థాపించారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారిగా విజయ్‌కాంత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారాయన. అయితే.. ఆ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన డీఎడీకే తరఫున విజయ్‌కాంత్ ఒక్కడే విజయం సాధించారు. అనంతరం, 2009 జనరల్ ఎలక్షన్స్‌లో 40 స్థానాల్లో డీఎండీకే పోటీలో నిలిచింది. తమిళనాడులో 39 స్థానాల్లో, పుదుచ్చేరిలో ఒక్క స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు.
ప్రతిపక్ష నేతగా..
2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే పెను సంచలనం సృష్టించింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేయగా 29 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో, విజయకాంత్ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఐదేళ్లపాటు.. అంటే 2016 ఎన్నికల వరకు శాసనసభపక్ష నేతగా కొనసాగారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేయగా ఘోర ఓటమిని చవిచూసింది.
2016 ఎన్నికల తరువాత, జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా విజయకాంత్ అన్నాడీఎంకే నుండి విడిపోయాడు. ఇక, బీజేపీతో డీఎండీకేతో ఎన్డీయే నాయకుల సంప్రదింపులు జరిపారు. ఒకానొక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. విజయ్‌కాంత్‌కు ప్రత్యేక సూచన ఇచ్చి ఆయనను తన స్నేహితుడిగా పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకున్న వెన్నుపోటు రాజకీయాల కారణంగా విజయ్‌కాంత్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన తరచుగా ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్ అస్తమయం
Comments
Please login to add a commentAdd a comment