
సాక్షి, చెన్నై : డీఎండీకే నేత విజయకాంత్ ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చారు. బుధవారం గుమ్మిడి పూండిలో రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. డీఎండీకే అభ్యర్థులు 60 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే డీఎండీకే నేతలు కరువయ్యారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీచేస్తుండటంతో, ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేని పరిస్థితి ఉంది.
ఇక, విజయకాంత్ బావ మరిది, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికీ, లేదా కార్యాలయానికి పరిమితమైన విజయకాంత్, తన అభ్యర్థుల కోసం అడుగుబయట పెట్టకతప్పలేదు. బు«ధవారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ప్రచార పర్వంలోకి అడుగు పెట్టారు.
ఐదు రోజుల పర్యటన...
విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో విరుదాచలంతోపాటుగా మరో నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు తొలుత నిర్ణయించారు. అయితే, తమకు మద్దతుగా ప్రచారం చేసే వాళ్లు లేరంటూ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పెడుతున్న కేకల్ని విన్న విజయకాంత్ తానొస్తున్నానని అడుగు తీసి ముందుకు వేశారు. ఐదు రోజుల పాటుగా ఆయన ప్రచారం సాగనుంది. బుధవారం సాయంత్రం గుమ్మిడి పూండిలో సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. అయితే, ఎక్కడా ప్రసంగాలకు తావివ్వలేదు. కేవలం పార్టీ వర్గాలను వాహనం నుంచి పలకరిస్తూ విజయకాంత్ ప్రచారం చేశారు. గురువారం తిరుత్తణిలో, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చెన్నైలో తమ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ఆయన నిర్ణయించారు.
పరీక్ష చేసుకోవాల్సిందే
తన సోదరుడు సుదీష్, ఆయన భార్య పూర్ణిమ ఇద్దరు కరోనా బారిన పడటంతో ప్రేమలత విజయకాంత్‌కు సంకటం తప్పలేదు. ఆమె విరుదాచలంలో సుడిగాలి పర్యటనతో ఓట్ల వేటలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. తప్పనిసరిగా కరోనా పరీక్ష చేసుకోవాల్సిందేనని, తదుపరే ప్రచారంలోకి వెళ్లాలని ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కరోనా టెస్ట్ చేసుకోక తప్పలేదు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment