సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నుంచి తమను సాగనంపడంలో కీలకపాత్ర పోషించారని పరిశ్రమలశాఖ మంత్రి సంపత్‌పై మహిళా ఎమ్మెల్యే సత్య విరుచుకుపడ్డారు. శాపనార్థాలు పెడుతూ, అమ్మ జయలలిత ఆత్మ సంపత్‌ను క్షమించదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌లకు మళ్లీ సీటు దక్కలేదన్న విషయం తెలిసిందే. ఇందులో కొందరు అయితే, అన్నాడీఎంకే అధిష్టానాన్ని ఢీకొట్టే రీతిలో రెబల్స్‌గా పోటీ చేయగా, మరి కొందరు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున తమ సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేశారు. ఇంకొందరు అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి పార్టీ అభ్యర్థుల కోసం శ్రమించారు. రెబల్స్‌గా పోటీచేసిన వారిని, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున పోటీ చేసిన వారిని ఇప్పటికే పార్టీ నుంచి అన్నాడీఎంకే తొలగించింది.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గెలుపు అవకాశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సుదీర్ఘంగా సమీక్షల్లో ఉన్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఈ సమీక్షల్లో హోరెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల మంత్రి ఎంసీ సంపత్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి కడలూరు జిల్లా బన్రూట్టి ఎమ్మెల్యే సత్య, ఆమె భర్త, పార్టీ నేత పన్నీరుసెల్వంతో పాటు ఆరుగుర్ని అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపుతూ ప్రకటన వెలువడింది. అలాగే, మరికొన్ని జిల్లాల నేతలకు నోటీసులు జారీ అయ్యాయి.
ఇందులో ఈరోడ్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ఈరోడ్ జిల్లాల్లో ఇదివరకు సెంగోట్టయన్, కరుప్పన్నన్, తోపు వెంకటాచలం కీలక నేతలుగా ఉండే వారు. వీరి ఆధిపత్యంతో ఈ సారి వెంకటాచలంకు సీటు ఇవ్వలేదు. దీంతో రెబల్‌గా రంగంలోకి దిగిన ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. ఆ జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో తోపు వెంకటాచలం రాజకీయం సాగడంతో అన్నాడీఎంకే అభ్యర్థులు తీవ్ర కలవరంలో ఉన్నారు. దీంతో ఆ జిల్లాలో పరిస్థితిపై మంత్రులు సెంగోట్టయన్, కరుప్పన్నన్‌లకు అధిష్టానం నోటీసులు ఇవ్వడం గమనార్హం.
సంపత్‌కు శాపనార్థాలు..
అకారణంగా తమను పార్టీ నుంచి తొలగించడంలో కీలక పాత్ర పోషించారంటూ మంత్రి సంపత్‌కు ఎమెల్యే సత్య, ఆమె భర్త పన్నీరు సెల్వం శాపనర్థాలు పెట్టే పనిలో పడ్డారు. ఆదివారం మీడియాతో ఎమ్మెల్యే సత్య మాట్లాడుతూ తనకు సీటు నిరాకరించడంతో రాజకీయ, ప్రజాసేవ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం జరిగిందన్నారు. ఆ తర్వాత తాను నియోజకవర్గంలోనే లేదని, మనశ్శాంతి కోసం ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక పర్యటనల్లో నిమగ్నమయ్యానని వివరించారు. భర్త, తాను, మద్దతు నేతలు నియోజకవర్గంలోనే లేనప్పుడు, ఎలా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ప్రత్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో పనిచేసి ఉంటామని ప్రశ్నించారు.
తమను ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి సాగనంపాలన్న లక్ష్యంతో సంపత్ కుట్ర చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అమ్మ జయలలిత ఆత్మకూడా క్షమించదంటూ శాపనార్థలు పెట్టే పనిలో పడ్డారు. హోం శాఖను, ఇంటెలిజెన్స్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న సీఎం పళనిస్వామి, వారి ద్వారా విచారించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుంటుందని, తనకు జరిగినట్టుగా అన్యాయం మరెందరికో జరిగిన పక్షంలో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చదవండి: ఫలితాలకు ముందే ఆగిన శ్వాస
తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే!
Comments
Please login to add a commentAdd a comment