సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 163 హామీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు అమ్మ వాషింగ్ మెషన్లు, ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు, ఇంటి వద్దకే రేషన్, మహిళల కోసం ఇంటి దీపం పథకం, ఇంటింటా సౌరశక్తి గ్యాస్ స్టౌవ్‌లు, ఏడాదికి ఆరు సిలిండర్లు తదితర వాగ్ధానాలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
డీఎంకేకు పోటీగా..
డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో శనివారం వెలువడ్డ విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలు ఉచితాలకు అలవాటు పడిన నేపథ్యంలో అందుకు భిన్నంగా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. 500 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టోలో ఆదివారం మరికొన్ని అంశాలు చేర్చారు. చెన్నై కాట్టుపల్లిలో అదాని హార్బర్ నిర్మాణం నిలుపుదల, ఈలం తమిళులకు భారత పౌరసత్వం, పౌర చట్టానికి వ్యతిరేకత, చెన్నై – సేలం గ్రీన్ వే పనుల నిలుపుదల వంటి అంశాలను అందులో చేర్చారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఉచిత పథకాలకు పెద్దపీట వేస్తూ 163 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో విడుదల చేశారు.
మేనిఫెస్టోలోని పలు హామీలు
- అందరికీ ఇళ్లు, మహిళల కోసం అమ్మ ఇంటి దీపం పథకం, మహిళలకు ప్రయాణ చార్జీల్లో రాయితీ, ఉచిత వాషింగ్ మెషన్, సౌర శక్తి స్టౌవ్‌లు, ఇంటి వద్దకే రేషన్ సరుకులు, 2023– అమ్మ విజన్ అమలు, ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, కేబుల్ ప్రసారాలు, అమ్మ వివాహ కానుక పెంపుతో పాటు నవ దంపతులకు అన్ని రకాల వస్తువులతో ప్రత్యేక సారె.
- రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌ల విస్తరణ, క్యాన్సర్ చికిత్సకు ప్రాధాన్యత. ప్రసూతి సెలవులను 12 నెలలకు పొడిగింపు, మహిళా శివు సంరక్షణ నిధి పెంపు, మహిళ భద్రతకు అన్ని నగారాల్లోనూ గస్తీ వాహనం, పోలీసు యాప్, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు, అమ్మ బ్యాంకింగ్ కార్డుల పంపిణీ, ఇంటింటా దోమ తెరలు.
- రుణాలు రద్దు, 2జీబీ ఉచిత డేటా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా కేంద్రాల ఏర్పాటు. ఇంటికో ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తమిళులకు ప్రత్యేక ప్రా«ధాన్యతకు చర్యలు. పట్టణాలు, నగరాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ఏర్పాటు.
- వృద్ధాప్య ఫించన్లు రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంపు. ప్రత్యేక ప్రతిభావంతులకు రూ. 1,500 నుంచి రూ. 2500 పెంపు.
- జాతీయ అధికార భాషగా తమిళం. మద్రాసు హైకోర్టును తమిళనాడు హైకోర్టుగా మార్చడం, తమిళంలోనే వాదనలకు అనుమతి. తమిళాభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రవాస తమిళుల కోసం ప్రత్యేక విభాగం, ఈలం తమిళుల సంక్షేమం, జంట పౌరసత్వం, రాజీవ్ హంతుకుల విడుదల.
- వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, కొనుగోలు, విక్రయ కేంద్రాలు, అరటి నారతో వస్త్రాల తయారీకి పెద్ద పీట, కొబ్బరి మొక్కల పంపిణీ, గిడ్డంగుల విస్తరణ, సౌర శక్తి మోటారు పంపు సెట్ల రాయితీ కొనసాగింపు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, నమ్మల్వార్ పేరిట వ్యవసాయ పరిశోధన కేంద్రం, సీఎం – రైతు బంధు పథకం, దక్షిణ తమిళనాడులో అంతర్జాతీయ ప్రమాణాలతో బఫెల్లో పార్క్.
- పెట్రోల్‌ర, డీజిల్ ధర తగ్గింపునకు చర్యలు. 150 రోజులకు ఉపాధి పథకం పొడిగింపు. అమ్మగ్రీన్ హౌస్ నిర్మాణ సాయం రూ. 3.40 లక్షలకు పెంపు, సంక్రాంతి కానుక కొనసాగింపు. నెలసరి విద్యుత్‌చార్జీల వసూళ్లు, 9,10,11,12 తరగతి విద్యార్థులకు పౌష్టికాహార పథకం. అంగన్‌వాడీ పిల్లలకు పాలు, ఆటో డ్రైవర్లకు ఎంజీఆర్ గ్రీన్ ఆటో పథకం పేరిట రూ. 25 వేలు సాయం. దశల వారిగా మద్యం దుకాణాల మూత, సహకార రుణాలకు వడ్డీ రద్దు. ఆధ్యాతి్మక పర్యటనలకు ప్రభుత్వ సాయం పెంపు. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ.
చదవండి: ‘థౌజండ్ లైట్స్’ నుంచి ఖుష్బూ
లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం
Comments
Please login to add a commentAdd a comment