
ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్(70) మరణంతో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌కాంత్.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు.
(చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!)
ఆయన తండ్రి ఒక రైస్ మిల్లు యజమాని. కొడుకుని బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగస్థుడిగా చూడాలని ఆయన కోరిక. కానీ విజయకాంత్‌కు మాత్రం చిన్నపుడు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. తరచూ స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్తుండేవాడు. ఎంజీఆర్ సినిమాలను ఎక్కువగా చూసి ఆయనలా తాను కూడా పెద్ద హీరో కావాలనుకున్నాడట.
(చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్.. అవార్డుల రారాజు!)
అందుకే మధురై నుంచి చెన్నైకి తన మకాంని మార్చాడు. సినిమా అవకాశాలకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే తన శరీరం నల్లగా ఉండడంతో.. దర్శకనిర్మాతలు తనను రిజెక్ట్ చేసేవారట. ఈ విషయాన్ని విజయకాంతే పలు సందర్భాల్లో చెప్పాడు. ‘నా శరీర రంగు కారణంగా అనేకసార్లు తిరస్కారాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వెనుకడుకు వేయకుండా నిలబడ్డా..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేడు ఈ స్థాయికి చేరాను’అని ఓ ఇంటర్వ్యూలో విజయకాంత్ అన్నారు.
విజయ్‌రాజ్ నుంచి విజయకాంత్‌గా
విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. ఇండస్ట్రీ ఎంట్రీతోనే తన పేరును మార్చుకున్నాడు. అయితే ఈ పేరు మార్పు తన మొదటి సినిమా డైరెక‍్టర్‌దేనట. విజయ్ తొలి సినిమా ‘ఇనిక్కమ్ ఇళమై’(1979). ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఏంఏ కాజాకు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి అనే పేరు నచ్చలేదట. ఆ సమయంలో రజనీకంత్ హవా బాగా నడుస్తుండడంతో ఆయన పేరులోని నుంచి కాంత్ అనే పదాన్ని తీసి విజయ్ రాజ్‌కు యాడ్ చేశాడట. అలా విజయ్రాజ్ పేరును విజయకాంత్‌గా మార్చాడు.
ఒకే ఏడాది 18 సినిమాలు..
27 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయకాంత్.. కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తొలిసినిమా ఇనిక్కుమ్ ఇలమై (1979). అందులో ఆయన విలన్ పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, సత్తం ఓరు ఇరుత్తర్లై’ చిత్రాలతో సక్సెస్ బాట పడ్డాడు. 2015 వరకు నిర్విరామంగా సినిమాల్లో నటించాడు. మూడు షిఫ్ట్‌ల్లో పని చేస్తూ ఏడాదికి ఐదారు సినిమాలను రిలీజ్ చేసేశాడు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలై రికార్డును సృష్టించాయి. ఎస్. ఏ. చంద్రశేఖర్, రామ నారాయణన్ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు.