సాక్షి, చైన్నె : దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం(డీఎండీకే) ప్రధాన కార్యదర్శిగా ప్రేమలత విజయకాంత్ ఎంపికయ్యారు. కోశాధికారి పదవి నుంచి ఆమెకు ప్రమోషన్ కల్పిస్తూ డీఎండీకే సర్వ సభ్య సమావేశంలో గురువారం తీర్మానం ఆమోదించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పార్టీ సర్వ సభ్య సమావేశానికి హాజరైన అధ్యక్షుడు విజయకాంత్ నీరసించి ఉండడంతో మహిళా కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు.
నేపథ్యం ఇదీ..
2005లో సినీ నటుడు విజయకాంత్ డీఎండీకేను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో తానొక్కడే అసెంబ్లీకి ఎన్నికై నా , ఆయన పార్టీ సాధించిన ఓటు బ్యాంక్ తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో చేతులు కలిపి డీఎంకేను చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూసినా ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆతర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది. దీంతో తన వద్ద అదనంగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌కు అప్పగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు.
మహిళా నేత నుంచి ప్రధాన కార్యదర్శి వరకు
విజయకాంత్ ఆస్పత్రిలో మూడు వారాలకు పైగా చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై వదంతులు సైతం వచ్చాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం తిరువేర్కాడులో జరిగిన డీఎండీకే సర్వస సమావేశానికి ఆయన హాజరయ్యారు. చిక్కి శల్యమైన తమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమవుతూ, కరతాళ ధ్వనులతో ఆయన్ని కేడర్ ఆహ్వానించింది. వేదిక మీద కూర్చుని తన దైన శైలిలో హావాభావాలతో అభిమానులు, కేడర్‌ను విజయకాంత్ పలకరించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో 17 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో కీలక తీర్మానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రేమలత విజయకాంత్‌కు అప్పగించారు.
ఈ సమయంలో తన భర్త, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ నుంచి ప్రేమలత ఆశీస్సులు అందుకున్నారు. ఈ సమయంలో ఆ వేదిక అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. ప్రేమలత విజయకాంత్ డీఎండీకే ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు విజయకాంత్ వెన్నంటి ఉంటూ వచ్చారు. పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా 13 ఏళ్లు పనిచేశారు. 2018 నుంచి డీఎండీకే కోశాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విజయకాంత్ అనారోగ్య పరిస్థితులతో పార్టీని తన భుజాన వేసుకుని నడిపించేందుకు ప్రేమలత సిద్ధమయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తన తొలి ప్రసంగంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లడమే కాకుండా, కేడర్, అభిమానులకు ఎల్ల వేళలా తాను అండగా ఉంటానని విజయకాంత్ బాణిలో ప్రకటించారు.
అదే సమయంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పందేరాలు, తదితర నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని మాత్రం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌కు అప్పగించారు. ఇవికాకుండా ఇతర నిర్ణయాలను తీసుకునే అధికారం ప్రేమలతకు కేటాయించారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి హాజరైన విజయకాంత్ చిక్కిశల్యమైన కనిపించడం అభిమానులు, కేడర్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. కుర్చీలో తనకు తానుగా కూర్చునే స్థితి లేక, తరచూ తన దైన శైలిలో సంకేతాన్ని చూపించే ప్రయత్నంలో ముందుకు పడబోయిన ఆయన్ని వెనుక నుంచి తనయుడు విజయ ప్రభాకరన్, పార్టీ నేత పార్థసారథి గట్టిగా పట్టుకునే ఉండడం అభిమానులను కలిచి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment