Premalatha Vijayakanth
-
ప్రేమలతకు ప్రమోషన్...నేపథ్యం ఇదీ
సాక్షి, చైన్నె : దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం(డీఎండీకే) ప్రధాన కార్యదర్శిగా ప్రేమలత విజయకాంత్ ఎంపికయ్యారు. కోశాధికారి పదవి నుంచి ఆమెకు ప్రమోషన్ కల్పిస్తూ డీఎండీకే సర్వ సభ్య సమావేశంలో గురువారం తీర్మానం ఆమోదించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పార్టీ సర్వ సభ్య సమావేశానికి హాజరైన అధ్యక్షుడు విజయకాంత్ నీరసించి ఉండడంతో మహిళా కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. నేపథ్యం ఇదీ.. 2005లో సినీ నటుడు విజయకాంత్ డీఎండీకేను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఎదుర్కొన్న ఎన్నికల్లో తానొక్కడే అసెంబ్లీకి ఎన్నికై నా , ఆయన పార్టీ సాధించిన ఓటు బ్యాంక్ తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో చేతులు కలిపి డీఎంకేను చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూసినా ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆతర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది. దీంతో తన వద్ద అదనంగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌కు అప్పగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. మహిళా నేత నుంచి ప్రధాన కార్యదర్శి వరకు విజయకాంత్ ఆస్పత్రిలో మూడు వారాలకు పైగా చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై వదంతులు సైతం వచ్చాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం తిరువేర్కాడులో జరిగిన డీఎండీకే సర్వస సమావేశానికి ఆయన హాజరయ్యారు. చిక్కి శల్యమైన తమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమవుతూ, కరతాళ ధ్వనులతో ఆయన్ని కేడర్ ఆహ్వానించింది. వేదిక మీద కూర్చుని తన దైన శైలిలో హావాభావాలతో అభిమానులు, కేడర్‌ను విజయకాంత్ పలకరించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో 17 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో కీలక తీర్మానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ప్రేమలత విజయకాంత్‌కు అప్పగించారు. ఈ సమయంలో తన భర్త, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ నుంచి ప్రేమలత ఆశీస్సులు అందుకున్నారు. ఈ సమయంలో ఆ వేదిక అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. ప్రేమలత విజయకాంత్ డీఎండీకే ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు విజయకాంత్ వెన్నంటి ఉంటూ వచ్చారు. పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా 13 ఏళ్లు పనిచేశారు. 2018 నుంచి డీఎండీకే కోశాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విజయకాంత్ అనారోగ్య పరిస్థితులతో పార్టీని తన భుజాన వేసుకుని నడిపించేందుకు ప్రేమలత సిద్ధమయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తన తొలి ప్రసంగంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లడమే కాకుండా, కేడర్, అభిమానులకు ఎల్ల వేళలా తాను అండగా ఉంటానని విజయకాంత్ బాణిలో ప్రకటించారు. అదే సమయంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పందేరాలు, తదితర నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని మాత్రం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌కు అప్పగించారు. ఇవికాకుండా ఇతర నిర్ణయాలను తీసుకునే అధికారం ప్రేమలతకు కేటాయించారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి హాజరైన విజయకాంత్ చిక్కిశల్యమైన కనిపించడం అభిమానులు, కేడర్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. కుర్చీలో తనకు తానుగా కూర్చునే స్థితి లేక, తరచూ తన దైన శైలిలో సంకేతాన్ని చూపించే ప్రయత్నంలో ముందుకు పడబోయిన ఆయన్ని వెనుక నుంచి తనయుడు విజయ ప్రభాకరన్, పార్టీ నేత పార్థసారథి గట్టిగా పట్టుకునే ఉండడం అభిమానులను కలిచి వేసింది. -
విజయకాంత్, ప్రేమలత అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటకకు చెందిన వ్యక్తిని అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా నియమించడాన్ని నిరసిస్తూ డీఎండీఎంకే శుక్రవారం భారీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు విజయకాంత్తోపాటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నాయూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సూరప్పను గవర్నర్ ఖరారు చేశారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి జల వివాదం, మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై రాష్ట్రంలో ఉధృతంగా పోరాటాలు సాగుతున్న తరుణంలో సూరప్ప నియామకం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇవేమీ పట్టనట్లుగా ఇటీవలే వైస్‌చాన్స్‌లర్ సూరప్ప బాధ్యతలు చేపట్టారు. సూరప్ప పేరును ఉపసంహరించాలని కోరుతూ ఈనెల 18వ తేదీన గవర్నర్ బంగ్లా దిశగా ర్యాలీలు నిర్వహించాలని డీఎండీకే నిర్ణయించింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసు నిషేధాజ్ఞలు మీరి ఈనెల ర్యాలీ జరపాలని డీఎండీకే శ్రేణులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సైదాపేట పనగల్మాలిగై వద్ద వేలాదిగా చేరుకున్నారు. వందకుపైగా పోలీసులు మోహరించారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత నాయకత్వంలో పార్టీ కార్యకర్తలంతా గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా కదిలారు. వీసీగా సూరప్ప నియామకాన్ని ఖండిస్తూ, గోబ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ కొద్దిదూరం కూడా సాగకమునుపే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు కార్యకర్తలు గవర్నర్ బంగ్లా వైపు పరుగులు పెట్టగా పోలీసులు వారి వెంటపడి పట్టుకున్నారు. గవర్నర్ బంగ్లా ముట్టడియత్నం చేసిన విజయకాంత్, ప్రేమలత సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో కూర్చుని ఉన్న విజయకాంత్ గవర్నర్ బంగ్లావైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. డీఎండీకే ఆందోళన కారణంగా సైదాపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అరెస్ట్ చేసిన వారందరినీ సాయంత్రం విడిచిపెట్టారు. -
ప్రతిపక్షం అన్నింటా వైఫల్యం
తిరువళ్లూరు: రాష్ట్రంలో అసమర్ధుడైన ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లే ప్రజా సమస్యలపై గళమెత్తే పరిస్థితి లేకుండా పోయిందని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ఆరోపించారు. బస్సు చార్జీల మోతకు నిరసనగా డీఎండీకే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని బజారువీధిలో ధర్నాకు జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షత వహించారు. ప్రేమలతా విజయకాంత్ హాజరై ప్రసంగించారు. మొదట ఆమె ఎద్దుల బండిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేస్తూ, బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రంలో స్టాలిన్ లాంటి అసమర్థ నేత ప్రతిపక్షంగా ఉండడం ప్రజల దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్టాలిన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం పలికారు. అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని స్పష్టం చేసిన ఆమె, వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే అడ్రస్ లేకుం డా పోతుందని విమర్శించారు. రవాణా శాఖలో రూ.5,700 కోట్ల కుంభకోణం, కార్మిక సంఘాల పేరిట విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న నేతల వైఖరే నష్టాలకు కారణమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినీ నటులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని పరోక్షంగా కమల్ రజనీకాంత్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రేమలత, జయలలిత ఉన్నప్పుడు వారెం దుకు పార్టీని స్థాపించలేదని ప్రశ్నించారు. ఆందోళనలో పార్టీ నేతలు శేఖర్, శరవణన్, రజనీకాంత్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు పెదవి విప్పిన వదినమ్మ...
సాక్షి, చెన్నై: ఎందరు వెళ్లినా, తమ బలం తమదే అని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ విజయకాంత్ వెన్నంటి లక్షల్లో అభిమానులు ఉన్నారని, వారి మద్దతుతో పూర్వ వైభవం తప్పనిసరిగా వ్యాఖ్యానించారు. పార్టీని వీడి వెళ్తున్న నాయకులందరూ ద్రోహులే అని మండిపడ్డారు. ఇక, ఎన్నికల సమయంలో ఎండీఎంకే నేత వైగో తమకు తీవ్ర షాక్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు వ్యతిరేకంగా ఆ పార్టీ వర్గాలే పెదవి విప్పడం మొదలెట్టాయి. ఆమె అనాలోచిత నిర్ణయాలతో పార్టీ పాతాళంలోకి నెట్టబడిందని విమర్శలు, ఆగ్రహం ప్రదర్శించే వాళ్లు ఎక్కువే. కొందరు గుడ్‌బై చెప్పి బయటకు వస్తుం టే, మరికొందరు కెప్టెన్ మీదున్న అభిమానంతో ఇంకా అంటి పెట్టుకుని ఉన్నారు. అదే సమయంలో వదినమ్మ ప్రేమలత జోక్యం ఇక పార్టీలో ఉండకూడదంటూ కెప్టెన్‌కు హెచ్చరికలు, సూచనలు చేసేవాళ్లు పెరిగారు. తన మీద పార్టీ వర్గా లు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా, మౌనంగా ఉంటూ వచ్చిన ప్రేమలత శుక్రవారం పెదవి విప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేమిటో, కెప్టెన్ ఏమిటో వివరిస్తూ, పార్టీ వ్యవహా రాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కెప్టెన్ ఏ నిర్ణయాన్నైనా సరే కార్యకర్తలతో చర్చించి తీసుకుంటారని వ్యాఖ్యానించారు. వైగో షాక్ ఇచ్చారు: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా డీఎండీకే అవతరించాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమ కూటమితో పయనం సాగించామని ప్రేమలత గుర్తు చేశారు. అవినీతి డీఎంకేను తరిమి కొట్టడం లక్ష్యంగా 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే తీరు నచ్చక బయటకు వచ్చామని, ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించామని వివరించారు. అందుకే ప్రజలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనే విధంగా ప్రజా కూటమికి నేతృత్వం వహించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల చివరి క్షణంలో ఎండీఎంకే నేత వైగో పెద్ద షాక్కే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమైనా, చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండడం ఆవేదన కల్గించిందని పేర్కొన్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినా, ఆయన ఏ మాత్రం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరి పయనమా లేదా..? అన్నది కెప్టెన్ ప్రకటిస్తారని చెప్పారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా కెప్టెన్ స్వయంగా ఇంత వరకు ప్రకటించలేదుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మా వల్లే ఓటమి: డీఎంకేకు తమ వల్లే గట్టి దెబ్బ తగిలిందని వివరించారు. తమతో పొత్తుకు డీఎంకే ముందుకు రాని దృష్ట్యా, అధికారం వారి చేతికి చిక్కలేదని ఎద్దేవా చేశారు. డీఎంకే అవినీతి పార్టీ అన్న విషయాన్ని కెప్టెన్ ఎప్పుడో పరిగణించారని, అందుకే వారి వెంట వెళ్లకూడదన్న నిర్ణయంతో ఆది నుంచి ఉంటూ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమిటో అని ఈసందర్భంగా ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో 37 సీట్లను గెలుచుకున్న అన్నాడీఎంకేతో ఒరిగిందేమిటో అని పొంతన లేని సమాధానం ఇవ్వడం గమనార్హం. అభిమానులు మా వెంటే: కెప్టెన్‌ను చూస్తే పీఎంకే అధినేత రాందాసు, ఆయన తనయుడు రాందాసులకు భయం అని, అందుకే తమను టార్గెట్ చేసి వ్యాఖ్యల్ని సంధిస్తున్నారని మండిపడ్డారు. డీఎండీకే గురించి వారికి ఏమి తెలుసునని, వాళ్ల పార్టీ గురించి ముందు ఆలోచించుకుంటే మంచిదంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎండీకే నుంచి ఎందరు బయటకు వెళ్లినా, కెప్టెన్ బలం...కెప్టన్ దే...మా బలం మాదే...! అని ధీమా వ్యక్తం చేశారు. వెళ్తున్న వాళ్లందరూ ద్రోహులు అని, చంద్రకుమార్ లాంటి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కెప్టెన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వెళ్తూ..వెళ్తూ నిందల్ని వేయడం చూస్తుంటే, ఏ మేరకు కెప్టెన్‌కు ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎందరు నాయకులు బయటకు వెళ్లినా, కెప్టెన్ అభిమానులు లక్షల్లో వెన్నంటి ఉన్నారని, వాళ్లను కదిలించడం అంత సులభం కాదని ధీమా వ్యక్తం చేశారు. జోక్యం లేదు: పార్టీ వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోనని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న కెప్టెన్ ముందుగా నాయకులతో చర్చిస్తారని, తదుపరి కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటారని వివరించారు.నిర్ణయం తీసుకున్న తర్వాత చివరకు తనకు సమాచారం ఇస్తారేగానీ, ఎన్నడూ తనకు ముందే ఎలాంటి విషయాలు చెప్పరని వ్యాఖ్యానించారు. 2005లో పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వ్యవహారాల్లోనూ ప్రతిచోట కార్యకర్తలు కన్పిస్తారని, వారి అభీష్టం మేరకు కెప్టెన్ నిర్ణయం ఉంటుందన్నారు.