
ర్యాలీలో విజయకాంత్, ప్రేమలత
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటకకు చెందిన వ్యక్తిని అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా నియమించడాన్ని నిరసిస్తూ డీఎండీఎంకే శుక్రవారం భారీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌తోపాటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అన్నాయూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సూరప్పను గవర్నర్ ఖరారు చేశారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి జల వివాదం, మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై రాష్ట్రంలో ఉధృతంగా పోరాటాలు సాగుతున్న తరుణంలో సూరప్ప నియామకం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇవేమీ పట్టనట్లుగా ఇటీవలే వైస్‌చాన్స్‌లర్ సూరప్ప బాధ్యతలు చేపట్టారు. సూరప్ప పేరును ఉపసంహరించాలని కోరుతూ ఈనెల 18వ తేదీన గవర్నర్ బంగ్లా దిశగా ర్యాలీలు నిర్వహించాలని డీఎండీకే నిర్ణయించింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతించలేదు.
దీంతో పోలీసు నిషేధాజ్ఞలు మీరి ఈనెల ర్యాలీ జరపాలని డీఎండీకే శ్రేణులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సైదాపేట పనగల్‌మాలిగై వద్ద వేలాదిగా చేరుకున్నారు. వందకుపైగా పోలీసులు మోహరించారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత నాయకత్వంలో పార్టీ కార్యకర్తలంతా గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా కదిలారు. వీసీగా సూరప్ప నియామకాన్ని ఖండిస్తూ, గోబ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ కొద్దిదూరం కూడా సాగకమునుపే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు కార్యకర్తలు గవర్నర్ బంగ్లా వైపు పరుగులు పెట్టగా పోలీసులు వారి వెంటపడి పట్టుకున్నారు. గవర్నర్ బంగ్లా ముట్టడియత్నం చేసిన విజయకాంత్, ప్రేమలత సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో కూర్చుని ఉన్న విజయకాంత్ గవర్నర్ బంగ్లావైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. డీఎండీకే ఆందోళన కారణంగా సైదాపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అరెస్ట్ చేసిన వారందరినీ సాయంత్రం విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment