ఎట్టకేలకు పెదవి విప్పిన వదినమ్మ...
సాక్షి, చెన్నై: ఎందరు వెళ్లినా, తమ బలం తమదే అని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ విజయకాంత్ వెన్నంటి లక్షల్లో అభిమానులు ఉన్నారని, వారి మద్దతుతో పూర్వ వైభవం తప్పనిసరిగా వ్యాఖ్యానించారు. పార్టీని వీడి వెళ్తున్న నాయకులందరూ ద్రోహులే అని మండిపడ్డారు. ఇక, ఎన్నికల సమయంలో ఎండీఎంకే నేత వైగో తమకు తీవ్ర షాక్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు వ్యతిరేకంగా ఆ పార్టీ వర్గాలే పెదవి విప్పడం మొదలెట్టాయి.
ఆమె అనాలోచిత నిర్ణయాలతో పార్టీ పాతాళంలోకి నెట్టబడిందని విమర్శలు, ఆగ్రహం ప్రదర్శించే వాళ్లు ఎక్కువే. కొందరు గుడ్‌బై చెప్పి బయటకు వస్తుం టే, మరికొందరు కెప్టెన్ మీదున్న అభిమానంతో ఇంకా అంటి పెట్టుకుని ఉన్నారు. అదే సమయంలో వదినమ్మ ప్రేమలత జోక్యం ఇక పార్టీలో ఉండకూడదంటూ కెప్టెన్‌కు హెచ్చరికలు, సూచనలు చేసేవాళ్లు పెరిగారు. తన మీద పార్టీ వర్గా లు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా, మౌనంగా ఉంటూ వచ్చిన ప్రేమలత శుక్రవారం పెదవి విప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేమిటో, కెప్టెన్ ఏమిటో వివరిస్తూ, పార్టీ వ్యవహా రాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కెప్టెన్ ఏ నిర్ణయాన్నైనా సరే కార్యకర్తలతో చర్చించి తీసుకుంటారని వ్యాఖ్యానించారు.
వైగో షాక్ ఇచ్చారు:
డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా డీఎండీకే అవతరించాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమ కూటమితో పయనం సాగించామని ప్రేమలత గుర్తు చేశారు. అవినీతి డీఎంకేను తరిమి కొట్టడం లక్ష్యంగా 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే తీరు నచ్చక బయటకు వచ్చామని, ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించామని వివరించారు. అందుకే ప్రజలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనే విధంగా ప్రజా కూటమికి నేతృత్వం వహించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల చివరి క్షణంలో ఎండీఎంకే నేత వైగో పెద్ద షాక్కే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అది ఆయన వ్యక్తిగత నిర్ణయమైనా, చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండడం ఆవేదన కల్గించిందని పేర్కొన్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినా, ఆయన ఏ మాత్రం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరి పయనమా లేదా..? అన్నది కెప్టెన్ ప్రకటిస్తారని చెప్పారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా కెప్టెన్ స్వయంగా ఇంత వరకు ప్రకటించలేదుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
మా వల్లే ఓటమి: డీఎంకేకు తమ వల్లే గట్టి దెబ్బ తగిలిందని వివరించారు. తమతో పొత్తుకు డీఎంకే ముందుకు రాని దృష్ట్యా, అధికారం వారి చేతికి చిక్కలేదని ఎద్దేవా చేశారు. డీఎంకే అవినీతి పార్టీ అన్న విషయాన్ని కెప్టెన్ ఎప్పుడో పరిగణించారని, అందుకే వారి వెంట వెళ్లకూడదన్న నిర్ణయంతో ఆది నుంచి ఉంటూ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమిటో అని ఈసందర్భంగా ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో 37 సీట్లను గెలుచుకున్న అన్నాడీఎంకేతో ఒరిగిందేమిటో అని పొంతన లేని సమాధానం ఇవ్వడం గమనార్హం.
అభిమానులు మా వెంటే: కెప్టెన్‌ను చూస్తే పీఎంకే అధినేత రాందాసు, ఆయన తనయుడు రాందాసులకు భయం అని, అందుకే తమను టార్గెట్ చేసి వ్యాఖ్యల్ని సంధిస్తున్నారని మండిపడ్డారు. డీఎండీకే గురించి వారికి ఏమి తెలుసునని, వాళ్ల పార్టీ గురించి ముందు ఆలోచించుకుంటే మంచిదంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎండీకే నుంచి ఎందరు బయటకు వెళ్లినా, కెప్టెన్ బలం...కెప్టన్ దే...మా బలం మాదే...! అని ధీమా వ్యక్తం చేశారు.
వెళ్తున్న వాళ్లందరూ ద్రోహులు అని, చంద్రకుమార్ లాంటి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కెప్టెన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వెళ్తూ..వెళ్తూ నిందల్ని వేయడం చూస్తుంటే, ఏ మేరకు కెప్టెన్‌కు ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎందరు నాయకులు బయటకు వెళ్లినా, కెప్టెన్ అభిమానులు లక్షల్లో వెన్నంటి ఉన్నారని, వాళ్లను కదిలించడం అంత సులభం కాదని ధీమా వ్యక్తం చేశారు.
జోక్యం లేదు: పార్టీ వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోనని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న కెప్టెన్ ముందుగా నాయకులతో చర్చిస్తారని, తదుపరి కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటారని వివరించారు.నిర్ణయం తీసుకున్న తర్వాత చివరకు తనకు సమాచారం ఇస్తారేగానీ, ఎన్నడూ తనకు ముందే ఎలాంటి విషయాలు చెప్పరని వ్యాఖ్యానించారు. 2005లో పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వ్యవహారాల్లోనూ ప్రతిచోట కార్యకర్తలు కన్పిస్తారని, వారి అభీష్టం మేరకు కెప్టెన్ నిర్ణయం ఉంటుందన్నారు.