సుప్రీంకు అన్న, వదిన..
వారెంట్ రద్దుకు పిటిషన్
విల్లుపురం కోర్టు సమన్లు
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతల, ఆ పార్టీ వర్గాల మీదున్న పరువు నష్టం దావాల విచారణల వేగం పెరిగింది. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసి ఉంటే, విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేయడం గమనార్హం. సీఎం జయలలితకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు గుప్పించే వారిపై పరువు నష్టం దావాల మోత రాష్ట్రంలో మోగడం జరుగుతున్నది. ఆ దిశగా డీఎండీకే అధినేత విజయకాంత్‌పై అనేకానేక పిటిషన్లు జిల్లాల వారీగా దాఖలై ఉన్నాయి. పిటిషన్ల విచారణల్లో భాగంగా కోర్టు మెట్లు ఎక్కకుండా డుమ్మాలు కొడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్ కోర్టు డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బుధవారం విల్లుపురం కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం. మరో కేసు నిమిత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉండగా, డుమ్మా కొట్టారు. ఎక్కడ తిరుప్పూర్ కోర్టు తరహాలో విల్లుపురం కోర్టు సైతం పీటీ వారెంట్ జారీ చేస్తుందోనన్న ఆందోళనతో విజయకాంత్, ప్రేమలత తరఫున న్యాయవాదులు మేల్కొన్నారు.
ఆ ఇద్దరు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితులను వివరించడంతో న్యాయమూర్తి సరోజిని దేవి ఏకీభవించారు. ఆగస్టు తొమ్మిదో తేదీకి విచారణ వా యిదా వేస్తూ, ఆ రోజున తప్పని సరిగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. విల్లుపురం కోర్టు సమన్లతో తప్పించుకున్నా, తిరుప్పూర్ కోర్టు వారెంట్‌తో ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తుందోనన్న బెంగ తో విజయకాంత్, ఆయన సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరి తరఫున న్యాయవాది మణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్‌ను రద్దు చేయాలని విన్నవించారు.