అన్న, వదినమ్మకు వారెంట్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు తిరుప్పూర్ కోర్టు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలన్న ఈ వారెంట్‌తో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆధార రహిత ఆరోపణలు గుప్పించినా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఇందుకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కోకొల్లలుగా దాఖలు చేశారు.
ఇందులో భాగంగా గతంలో తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరిగిన బహిరంగ సభలో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత సీఎం జయలలితను టార్గెట్ చేసి తీవ్రంగానే విరుచుకు పడ్డారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది సుబ్రమణియన్ తిరుప్పూర్ మొదటి మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పించిన విజయకాంత్, ప్రేమలతలపై చర్యకు కోర్టును విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి అలమేలు నటరాజన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు సమన్లు జారీ చేసింది.
అయితే, ఆ సమన్లను ఆ ఇద్దరూ ఖాతరు చేయలేదు. మంగళవారం కోర్టుమెట్లు ఎక్కాల్సిన ఆ ఇద్దరు డుమ్మా కొట్టారు. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చినట్టుంది. ఆ ఇద్దర్నీ కోర్టులో హాజరు పరచాలని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ జారీతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. అసలే రోజుకో రూపంలో సమస్యలు తమ అన్న, వదినమ్మలను చుట్టుముట్టుతున్న సమయంలో ఈ వారెంట్ ఏమిటో అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు రాష్ర్టంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దృష్ట్యా, పోలీసులు అరెస్టు చేసినా చేస్తారేమో అన్న ఉత్కంఠకు గురి అవుతున్నారు. ఇది వరకు విజయకాంత్, ప్రేమలతల మీద వేర్వేరుగా కోర్టుల్లో పరువు నష్టం దావాలు విచారణలో ఉన్నాయి. అయితే, తిరుప్పూర్ కోర్టులో మాత్రం ఇద్దరి మీద ఒకే కేసు విచారణలో ఉన్నది.