మీడియాపై కెప్టెన్ మళ్లీ ఫైర్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ మీడియాతో మళ్లీ దురుసుగా వ్యవహరించారు. ప్రైవేటు భద్రతా సిబ్బందిని కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎండీఎంకే, వీసీకే, తమాకా, వామపక్షాలతో కూడిన ప్రజా సంక్షేమ కూటమికి డీఎండీకే అధినేత విజయకాంత్ సీఎం అభ్యర్థిగా నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయికతే ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సేలం టౌన్ కు వచ్చిన విజయకాంత్‌ను మీడియా చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాలుక మడత పెట్టి, పిడికిలి బిగిస్తూ కొట్టేందుకు సిద్ధపడి చివరకు తనను తాను సముదాయించుకున్నారు. ఓ మీడియా మైక్‌ను లాగి పడేసి ముందుకు సాగారు.
చివరకు తన వెంట ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బందిపై ఆగ్రహాన్ని చూపించి మోచేతితో ఓ వ్యక్తిపై దాడి చేశారు. కొంత కాలం నుంచి మీడియాతో దురుసుగా వ్యవహరిస్తూ వచ్చిన విజయకాంత్, సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో తన పంథాను మార్చుకున్నట్లు కనిపించారు. అయితే, మళ్లీ తన ఆవేశాన్ని వెళ్లగక్కడంతో రాజకీయ ప్రత్యర్థులు ఈ విషయంపై వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థినో, పార్టీ నాయకుడినో చితక్కొట్టడం విజయకాంత్‌కు పరిపాటే కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.