
విజయకాంత్ కు ఊరట
పరువు నష్టం కేసులో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరికి తిరుప్పూర్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై అత్యున్నత న్యాయస్థానం గురువారం స్టే ఇచ్చింది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ విజయకాంత్, ప్రేమలతపై తమిళనాడులోని పలు జిల్లాల్లో పరువు నష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకాకపోవడంతో వీరికి తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీచేసింది. మరోవైపు ఆగస్టు 9న తమ ఎదుట హాజరుకావాలని విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన విజయకాంత్ కు పరువునష్టం కేసులు తలనొప్పిగా మారాయి.