
న్యూయార్క్: పరువు నష్టం కేసులో కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏబీసీ న్యూస్ ఛానల్ రాజీ కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా సుమారు రూ.127 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తమ వెబ్‌సైట్‌లో ఒక నోట్‌ను ఉంచేందుకు ముందుకొచ్చింది.
ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ రచయిత్రి జీన్ కరోల్ కోర్టు కెక్కారు. గతేడాది విచారణ చేపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి, ప్రతిష్టకు భంగం కలిగించడం వంటి నేరాలకు రూ.42 కోట్లు ఆమెకు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది.
ఇదే కేసులో ఈ ఏడాది జనవరిలో మరికొన్ని ఆరోపణలపై మరో రూ.700 కోట్ల చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ కోర్టు రేప్ అనే మాటను ఎక్కడా పేర్కొనలేదు. అయితే, ఏబీసీ న్యూస్ ఛానెల్ ప్రముఖ యాంకర్ జార్జి స్టెఫనోపౌలోస్ మార్చి 10వ తేదీన కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్‌తో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా జీన్ కరోల్‌ను ట్రంప్ రేప్ చేసినట్లు రుజువైందంటూ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment