
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఎన్నికల వేళ ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశికి ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఒక్క వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆమె మాట్లాడలేదని.. మొత్తం పార్టీని ఉద్దేశించే వ్యాఖ్యానించారని న్యాయస్థానం పేర్కొంది.
కాగా, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశి.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీలో చేరకపోతే.. ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కొందరు బీజేపీ నేతలు బెదిరించారంటూ ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టేసింది.
మరో వైపు, దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈ సారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది.
ఇదీ చదవండి: ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు
Comments
Please login to add a commentAdd a comment