ఢిల్లీ సీఎం అధికారిక నివాసం వద్ద ఘటన
కేజ్రీవాల్ తర్వాత అతిశి ఆ బంగ్లాలోకి అక్రమంగా వచ్చారన్న బీజేపీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం వేదికగా ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి అధికార ఆధిపత్యపోరు కనిపించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకు రాలు అతిశికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిశి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిశికి సంబంధించిన సామగ్రిని బయట పడేశా రని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. ‘‘ సీఎం అతిశికి అధికారిక బంగ్లాను కేటాయించలేదు. అందుకే ఇ న్నాళ్లూ సీఎంగా ఉన్నపుడు వినియోగించి, కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకే అతిశి మారారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ఆ బంగ్లాను బీజేపీ అగ్రనేతకు కేటాయించాలని కుట్ర పన్నింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను అడ్డుపెట్టుకుని అతిశికి చెందిన సామగ్రిని బయట పడేశారు. అంతకుముందు అదే బంగ్లాలోని క్యాంప్ ఆఫీస్‌లో అతిశి ఒక సమావేశం కూనిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ ఇలా చవకబారు బంగ్లా రాజకీయాలు చేస్తోంది’’ అని సంజయ్ వివరించారు.
బంగ్లాకు సీలు వేయాల్సిందే: బీజేపీ
వివాదంపై బీజేపీ దీటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో విపక్షనేత, బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘‘ గత ఏడాది కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి అతిశి చేరినప్పుడే కేబినెట్ మంత్రి హోదాలో ఆమెకు మథుర రోడ్డులోని ఏబీ–17 బంగ్లాను ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) గతంలోనే కేటాయించింది. ఆ బంగ్లా ఉండగా ఈ బంగ్లాతో సీఎంకు పనేంటి?. కేజ్రీవాల్ వెళ్లిపోయినా సీఎం బంగ్లా తాళాలు పీడబ్ల్యూడీకి అప్పజెప్పలేదు. ఇప్పుడు అతిశి అక్రమంగా ప్రవేశించిన ఈ బంగ్లాకు సీలు వేయాల్సిందే’’ అని గుప్తా డిమాండ్‌చేశారు.
అక్రమంగా తరలించారు: సీఎం కార్యాలయం
‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాలను శిరసావహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. అతిశి వస్తువులను బయట పడేయించారు. బీజేపీ బడా నేతకు ఈ బంగ్లాను కేటాయించాలను ఎల్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని అందుకోలేని బీజేపీ ఇప్పుడు సీఎం బంగ్లాను ఆక్రమించాలని చూస్తోంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
అది అధికారిక బంగ్లా కాదు: ఎల్జీ వర్గాలు
సీఎంఓ ప్రకటన తర్వాత ఎల్జీ కార్యాలయం వర్గాలు స్పందించాయి. ‘‘ సీఎం హోదాలో అతిశికి ఆ బంగ్లాను కేటాయించలేదు. అనుమతి లేకుండా అతిశి ఆమె సామగ్రిని బంగ్లాలోకి తరలించారు. తర్వాత ఆమెనే వాటిని బయటకు తరలించారు. ప్రస్తుతా నికి ఆ బంగ్లా పీడబ్ల్యూడీ అధీనంలోనే ఉంటుంది. గతంలో సమకూర్చిన వస్తువులను సరిచూసు కున్నాకే కేటాయిస్తారు’’ అని ఎల్జీ ఆఫీస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment