![Defamation case filed against Atishi court hearing on July 23](/styles/webp/s3/article_images/2024/06/29/atishi.jpg.webp?itok=y_tGWDRG)
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత, ఢిల్లీ మంత్రి అతిషిపై శనివారం పరువు నష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది. చిరునామా తప్పుగా ఉన్నందున సమన్లు అందజేయలేదని కోర్టు పేర్కొంది. కోర్టులో ఉన్న ఆమె న్యాయవాదికి ఫిర్యాదు కాపీని అందించారు.
ఈ కేసులో మంత్రి అతిషి తరఫున లాయర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. బీజేపీ నేత తరఫున న్యాయవాది శౌమేందు ముఖర్జీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశ చూపినట్లుగా తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ప్రవీణ్ శంకర్ కపూర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం.. ఓ సమావేశంలో మంత్రి అతిషి మాట్లాడుతూ.. బీజేపీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్ చేస్తూ.. నేతలను కొనేందుకు ప్రంయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తుందని.. ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ కొట్టిపడేసింది.
ఆ తర్వాత కూడా అతిషి మళ్లీ ఆరోపణలు చేశారు. తన సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని.. తనను బీజేపీలో చేరాలని కోరారని చెప్పారు. పార్టీ మారితేనే తన రాజకీయ జీవితం నిలబడుతుందని అన్నారని.. పార్టీ మారకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను ఒక నెలలోగా అరెస్టు చేస్తుందని బెదించారని ఆరోపించారు. ఈ కేసులో బీజేపీ పరువు నష్టం కింద నోటీసులు పంపింది. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment