
మేనిఫోస్టో విడుదల చేసిన అర్వింద్ కేజ్రీవాల్
ఐదేళ్లలోపు ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తామని భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా ఎనిమిది రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది.
ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి, మనీశ్ సిసోడియా తదితరుల సమక్షంలో పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ రెండో మేనిఫెస్టోను సోమవారం ‘కేజ్రీవాల్ గ్యారంటీ’పేరిట విడుదల చేశారు. ‘‘బీజేపీ నేతలు హామీలు ఇస్తారు కానీ అమలు చేయరు. మేం మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలోపు కచ్చి-తంగా అమలు చేస్తాం. ఢిల్లీలో ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే ఢిల్లీ వాసులపై ఆర్థిక భారం తప్పదు’’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ 15 గ్యారంటీలు ఇవే..
→ వచ్చే ఐదేళ్లలో ప్రతి యువకుడికి ఉపాధి
→ మహిళా సమ్మాన్ యోజన క్రింద ప్రతి మహిళకు నేరుగా బ్యాంకు ఖాతాకే రూ.2,100 నగదు జమ
→ సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స
→ తప్పుడు నీటి బిల్లుల మాఫీ
→ 24 గంటలు తాగు నీటి సరఫరా
→ యూరప్‌తరహాలో ప్రపంచ స్థాయి రోడ్లు
→ యమునా నదిని శుభ్రం చేయడం
→ డాక్టర్ అంబేడ్కర్ స్కాలర్‌షిప్ పథకం
→ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రోలో 50 శాతం రాయితీ
→ పూజారి–గ్రంథి సమ్మాన్ యోజన కింద హిందూ ఆలయాల్లో అర్చకులు, గురుద్వారాల్లో గ్రంథీలకు జీతభత్యాల కింద ఒక్కొక్కరికి రూ.18 వేలు
→ సొంతిళ్లవారితోపాటే అద్దెకు ఉంటున్న వారికీ ఉచిత విద్యుత్, నీరు
→ మురుగు నీటిపైపులైన్ల మరమ్మతు, ముగునీటి వ్యవస్థలను మెరుగుపరచటం
→ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డుల జారీ
→ ఆటో, టాక్సీ, ఇ–రిక్షా డ్రైవర్లకు జీవిత బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం, పిల్లలకు ఉచిత కోచింగ్
→ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు
Comments
Please login to add a commentAdd a comment