హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. గతంలో తన కుటుంబ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలకుగానూ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఇవాళ స్పెషల్ జడ్జి ముందు ఆమె హాజరై వివరణ ఇవ్వనున్నారు.
ఈ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే నాగార్జున కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించింది కోర్టు. గత వాదనల్లో.. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు.
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదించారు. అయితే తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పిన విషయాన్ని సురేఖ
తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని అశోక్ రెడ్డి వాదించారు.
ఈ క్రమంలో ఇరువైపులా వాదనల అనంతరం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు పలుమార్లు మంత్రికి సమన్లు జారీ చేసింది. అయితే పలు ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆమె వివరణ ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ ఆమె కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment