విజయ్కాంత్కు బ్లాక్బ్లస్టర్ లేనట్లే!
చెన్నై: ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల వంతే మిగిలింది. అది కూడా మరో రెండు రోజుల్లో.. ఈలోపు ఎవరికి తోచిన అంచనాలు వారివి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో కాస్తంత హడావిడిగా హంగుఆర్భాటంగా కనిపించిన వ్యక్తి మాత్రం విజయ్ కాంత్. డీఎండీకే అధ్యక్షుడు అయిన ఆయన గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజాసంక్షేమకూటమి పేరుతో మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనకు నిజంగానే తమిళనాడు ప్రజలు పట్టం కట్టబెట్టనున్నారా అన్నంత హడావిడి చేశారు. అదే క్రమంలో పలుమార్లు తన ప్రచార శైలితో విమర్శల పాలయ్యారు.
నిజంగానే తమిళ ప్రజలు ఈసారి మనసు మార్చుకొని థర్డ్ ఫ్రంట్కు అధికారం కట్టబెట్టనున్నారా అనే అంశంపైన చర్చలు జరగడం.. అదే స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే, ఈ ఫ్రంట్ ప్రచారానికి భిన్నంగా.. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయిన తొలినాళ్లనాటి పార్టీలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఎలాంటి లొల్లి లేకుండానే ఈ ఎన్నికల్లో డీఎండీకేను కార్నర్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన ఓటింగ్ శాతం.. అక్కడి ప్రజల ప్రతిస్పందన ప్రకారం చివరకు తమిళ ప్రజలు పూర్తి స్థాయిలో డీఎంకే, ఏఐడీఎంకేలకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఈసారి అధికార మార్పిడి జరిగి మరోసారి తమిళనాడులో కరుణోదయం కానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జయలలితకు భంగపాటు తప్పదని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయ చిత్రసీమలో ఇద్దరు అగ్ర నేతల చిత్రాల మధ్య సర్రున దూసుకెళ్దామనుకున్న డీఎండీకే అధినేత విజయ్ కాంత్ సినిమా ఊహించినంత బ్లాక్ బ్లస్టర్ కాదు కదా కనీసం యావరేజ్ కూడా అనిపించుకోబోదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.