అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును ప్రభుత్వ పథకాల్లో వినియోగిస్తున్నారన్న ఆరోపణల చిచ్చు రాజుకుంటోంది. ఇప్పటికే ఒక సంఘ సేవకుడు ప్రజా ప్రయోజన వాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. తాజాగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ గురువారం మరో పిటిషన్ వేశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి :
అన్నాడీఎంకే అధికారం చేపట్టిన తర్వాత అమలుచేస్తున్న అన్ని పథకాల్లోనూ అమ్మ (సీఎం జయలలిత) ఫొటో అనివార్యంగా మారింది. చిన్నపాటి బస్టాండు మొదలుకుని భారీ ప్రాజెక్టుల వరకు అమ్మ ఫొటోలు ఉంటాయి. అదేవిధంగా గురువారం చెన్నైలో ప్రారంభమైన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల ప్రాంగణంలో అన్ని మూలలా అమ్మ ఫొటోలు చోటుచేసుకున్నాయి. రెండు నెలల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన అమ్మ వాటర్ బాటిల్ నెక్‌ను రెండాకులను గుర్తుకు తెచ్చేరీతిలో డిజైన్ చేశారు. దీనిపై వెంటనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల జయలలిత ప్రారంభించిన సిటీ మినీ బస్సులపై ఆకుల బొమ్మలను స్పష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. దీనిపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా అసెంబ్లీలో అభ్యంతరాలు లేవనెత్తింది. మరోవైపు సంఘ సేవకుడు ఒకరు ఇదే అంశంపై మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేయగా అది విచారణలో ఉంది.
ఎన్నికల కోసమే రెండాకుల చిహ్నం: స్టాలిన్ పిటిషన్
ప్రస్తుత ఏర్కాడు ఉపఎన్నిక , వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జయలలిత తన పార్టీ గుర్తును ప్రచారం చేసుకుంటున్నారని డీఎంకే కోశాధికారి స్టాలిన్ విమర్శించారు. అన్నాడీఎంకేపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే జయలలిత అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వే యాలని, రెండాకుల గుర్తును తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అన్నా సమాధి వద్ద రెండాకుల చిహ్నం ఉండగా మరోసారి ఇదే తప్పిదానికి పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజలకు కల్పించే సౌకర్యాలను పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడం అధికార దుర్వినియోగమే అవుతుందని వివరించారు. అమ్మ వాటర్ బాటిల్, మినీ బస్సులపై ఉన్న రెండాకులను తొలగించాలని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్టాలిన్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ముఖ్యమంత్రి జయలలిత, రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కేకే శచీంద్రన్ విచారణ జరిపి శుక్రవారానికి వాయిదా వేశారు. విచారణ తీరుని వీక్షించేందుకు అన్నాడీఎంకే లీగల్ సెల్ కార్యదర్శి మనోజ్‌పాండియన్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.
అన్నాడీఎంకేపై ఎన్నికల కమిషన్‌కు డీఎంకే ఫిర్యాదు
Published Fri, Nov 8 2013 2:46 AM | Last Updated on Thu, May 24 2018 12:10 PM
Advertisement