దటీజ్ తమిళనాడు! | Politics in Tamilnadu | Sakshi
Sakshi News home page

దటీజ్ తమిళనాడు!

Published Mon, Mar 17 2014 3:11 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

దటీజ్ తమిళనాడు! - Sakshi

దటీజ్ తమిళనాడు!

ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇచ్చే హామీలలో తమిళ పార్టీలకు దేశంలో ఏ పార్టీలు సాటిరావు. ఇచ్చిన హామీలను అదే స్థాయిలో  ఆ పార్టీలే అమలు చేసి జనాన్ని ఆకట్టుకుంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తాచాటుకోడానికి తమిళ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అన్ని పార్టీలు పోటీలుపడి తమ తమ మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి.  దేశంలో ఎక్కడా లేనివిధంగా తమిళనాట ఎన్నికల్లో  మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.  భాష(తమిళ సెంటిమెంట్‌), వాదం, అభిమానం, పేదల సంక్షేమం...ఇలా ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో దేనిని వదిలిపెట్టరు. వీటన్నిటి మేళవింపుతో  మేనిఫెస్టోలు రూపొందించడానికి పార్టీలన్నీ కసరత్తు  చేస్తున్నాయి.

తమిళనాట ఎన్నికల వేడి జోరందుకుంది. పార్టీల ఎన్నికల హామీలు ఎల్లలు దాటుతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీలన్నీ వాడివేడి ప్రచారాస్త్రాలతో ఓటర్లను ఆకట్టుకోడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా పార్టీల మేనిఫెస్టోలే ఇక్కడ  తిరుగులేని ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. ఎవరికివారే  తమిళ జాతీయవాదం తమదంటే తమదని ఉపన్యాసాలు దంచేస్తూ ఎన్నికల రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఈ విధంగా  మేనిఫెస్టో రాజకీయం తమిళనాట దుమారం రేపుతోంది. ఉచితంగా టీవీలిస్తామని ఒక పార్టీ చెబితే, ఉచితంగా ల్యాప్ టాప్లు ఇస్తామని మరో పార్టీ చెబుతోంది. భాష, వాదం, రక్షణలో తామే ముందున్నాం అని ఒక పార్టీ చెబితే, కాదు అదంతా తమ వల్లే అవుతుందని  మరోపార్టీ చెబుతోంది. ఈ విధంగా  ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఎవరి ప్రచారం వారు, ఎవరి  వాగ్ధానాలు వారు చేస్తున్నారు. ఎన్నికల వేళ తమిళ పార్టీల్లో మేనిఫెస్టోల మోత మోగుతోంది.  

 అన్నాడిఎంకె, డిఎంకె, డిఎండికెలు మేనిఫెస్టోల రూపంలో తమ ఎన్నికల వాగ్ధానాలను జనం ముందుంచాయి. సానుకూల వాతావరణం, అనుకూలతలను బట్టి అధికార అన్నాడిఎంకే ముందుగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది.  ఆ తర్వాత డిఎంకే తన ఎన్నికల హామీ పత్రాన్ని జనం ముందుంచింది. ఇక రేపోమాపో తమ మేనిఫెస్టోలను విడుదల చేయడానికి ఇతర  పార్టీలు వాగ్ధాన పత్రాల తయారీలో మునిగితేలుతున్నాయి.  ఏ మేనిఫెస్టో చూసినా తమిళ వాసనే వస్తోంది. అలా లేకపోతే అక్కడ ఓట్లు రాలవు. తమిళులను రక్షించుతామని, వారి ప్రయోజనాలను కాపాడతామని అన్ని పార్టీలు ఊదరగొడుతున్నాయి. బలంగా ఉన్న తమిళసెంటిమెంటును పుష్కలంగా పండించుకోవడమే సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీల ముందున్న పెద్ద పని. దాదాపు అన్ని పార్టీలూ ఇదే రేసులో పాల్గొంటున్నాయి. అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో తమిళవాదాన్ని ప్రధానంగా తెరపైకి తెస్తున్నాయి.  శ్రీలంకలో తమిళుల రక్షణ - తీర ప్రాంత జాలర్లు - కావేరి జలాల సమస్య - రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధిపథంలో  ముందుంచటం-.... ఇటువంటి అంశాలపైనే అందరూ దృష్టిపెట్టారు.

 డిఎంకె కేంద్రంలో చక్రం తిప్పిన సందర్భంలో వారి 2జి అవినీతిని ఎండగట్టే ప్రయత్నంలో అన్నాడిఎంకె ఉంది. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను తవ్వే పనిలో డిఎంకె ఉంది. ఇక డిఎండికె అవినీతి రహిత సమాజం, సామాజిక న్యాయం అంటూ తమ  వాగ్ధానాలను ప్రజల చెవినేస్తోంది. ఇదంతా ఒకెత్తైతే, బీజేపీ మరో పంథాలో ముందుకు సాగుతోంది. తమిళనాడు హైందవ సాంప్రదాయాలకు ఆలవాలం -  ఆలయాల రాష్ట్రంగా ప్రసిద్ధి .. అటుంటి  ఇక్కడ నుండి మళ్లీ హిందుత్వాన్ని తెరపైకి తెచ్చి కొన్ని సీట్లైనా సాధించాలనే లక్ష్యంతో జాతీయ పార్టీ బీజేపీ తన ప్రచార పర్వం కొనసాగిస్తోంది.  జాతీయస్థాయి సమస్యలైన శ్రీలంక, జాలర్లు, రామసేతు అంశాలపై గొంతెత్తుతూ తమిళుల పరిరక్షణకు తామే కట్టుబడి ఉన్నామని చెబుతోంది.  

ఇక వామపక్షాల పంథా వేరుగా ఉంది. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలకు తాము కట్టుబడి ఉన్నామని, అందుకే మూడో కూటమిగా ముందుకు సాగుతున్నామంటూ పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిపోరుకు సిద్ధమయ్యాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ  పార్టీలు తమిళ భాష - తమిళవాదం - శ్రీలంకలో తమిళులకు రక్షణ - తమిళ జాలర్లకు రక్షణ.. ఇలా తమిళం సెంటిమెంటుతోనే ప్రచారం సాగుతుంది. దటీజ్ తమిళనాడు!.

s.nagarjuna@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement