అన్నాడీఎంకే మాజీ మంత్రులపై డీఎంకే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే నలుగురు మాజీలపై అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన డీవీఏసీ తాజాగా తంగమణి లక్ష్యంగా సోదాలు చేపట్టింది. ఇందులో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సాక్షి, చెన్నై(తమిళనాడు): మాజీ మంత్రి తంగమణిని బుధవారం డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్) టార్గెట్ చేసింది. తంగమణి, ఆయన కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాలు అంటూ 69 చోట్ల అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. ఈ చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్షసాధింపు ధోరణి తగదని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో సిద్ధం చేసిన జాబితా మేరకు..
అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సాగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం, లంచగొండితనం తదితరుల వ్యవహారాలపై ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓ జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వీరిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. తాజాగా, తాము అధికారంలోకి వచ్చినానంతరం ఆ జాబితాలో ఉన్న అవినీతి రాయుళ్ల భరతం పట్టే దిశగా డీఎంకే ప్రభుత్వం దూకుడు పెంచింది.
తొలుత రవాణశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్‌ను టార్గెట్ చేసి సోదాలు విస్తృతం చేసి, ఆయన్ని విచారణ వలయంలోకి తెచ్చా రు. తదుపరి ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఎంఆర్ విజ య భాస్కర్, రిజస్ట్రేషన్ల శాఖ మాజీ మంత్రి వీరమ ణిని టార్గెట్ చేశారు.
ఇటీవల నగరాభివృద్ధి శాఖ మంత్రి, పళనిస్వామి సన్నిహితుడు ఎస్పీ వేలుమణిపై దృష్టి పెట్టారు. తాజాగా మరో సన్నిహితుడు, విద్యుత్‌శాఖ మాజీ మంత్రి తంగమణి లక్ష్యంగా డీవీఏసీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు ఆయనపై కేసు నమోదు చేసింది.
ఏక కాలంలో సోదాలు
2016–2021 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.4.85 కోట్లు ఆస్తుల్ని తంగమణి గడించినట్టు ఆధారాలతో సహా తేల్చిన డీవీఏసీ వర్గాలు కేసు నమోదు చేశాయి. ఆయన భార్య శాంతి, కుమారు డు ధరణి ధరణ్‌ను సైతం ఈ కేసులో చేర్చారు. దీంతో బుధవారం ఉదయాన్నే పలు బృందాలుగా డీవీఏసీ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో తంగమణి ఆస్తులు, సన్నిహితుల ఇళ్లు, బినామీ సంస్థలపై దాడులకు దిగారు.
చెన్నై, నామక్కల్, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ తదితర తొమ్మిది జిల్లాలతో పాటుగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో అనేకచోట్ల పొద్దు పోయే వరకు సోదాలు జరిగాయి. నామక్కల్ జిల్లా ఆలపాళయంలోని తంగమణి ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే వర్గాలు అక్కడికి తరలివచ్చి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నైలో అరుంబాక్కం, షెనాయ్ నగర్‌తో పాటుగా 14 చోట్ల, సేలంలోని తంగమణి కుమారుడు ధరని ధరణ్ ఇంట్లోనూ సోదాలు సాగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, బినామీ సంస్థలు, పలు చోట్ల పెట్టుబడులే కాకుండా క్రిష్టోకరెన్సీలోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.
కొన్నిచోట్ల సోదాలు ముగిసినా, తంగమణి, ధరణి ధరణ్ నివాసాలు, టైల్స్ సంస్థలు, మాల్స్‌లలో ఇంకా సోదాలు సాగుతున్నాయి. కాగా ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కక్ష సాధింపు తగదు
డీవీఏసీని ఉసిగొలిపి డీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సేలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తాము నిరసనలకు పిలుపు నివ్వగానే కేసులు, దాడులు అంటూ ముందుకు సాగడం శోచనీయమన్నారు. ఈ విషయంపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పందిస్తూ, 2011 తర్వాత తనతో పాటుగా డీఎంకే వర్గాల్ని అన్నాడీఎంకే సర్కారు పెద్దఎత్తున అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. అది కక్షసాధింపు అయితే, ఇది కూడా అలాగే అనుకోనివ్వండి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment