
కోర్టుకు హాజరైన నిందితులు
సాక్షి, చెన్నై: కొడనాడు హత్య, దోపిడీ కేసు విచారణ వేగం పుంజుకుంది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017 ఏప్రిల్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన తెలిసిందే. విచారణ సమయంలో ఈ కేసుతో ముడిపడేలా అనేక అనుమానాస్పద మరణాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. అవన్నీ నీరుగారినా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా సయన్, మనోజ్‌ను గుర్తిస్తూ విచారణకు తెర దించేశారు. ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు కొడనాడు మిస్టరీ రట్టు చేసే దిశగా మళ్లీ దర్యాప్తు చేయడం, అసెంబ్లీలో రగడ వరకు పరిస్థితులు దారి తీశాయి.
ఊటీ సెషన్స్ కోర్టులో.. విచారణ
ప్రధాన నిందితులైన సయన్, మనోజ్‌ను నీలగిరి ఎస్పీ ఆశీష్ రావత్ నేతృత్వంలోని బృందం ప్రశ్నించడం వంటి పరిణామాలు ఈ కేసులో ఉత్కంఠ రేపాయి. మాజీ సీఎం పళనిస్వామిని టార్గెట్ చేసి ఈ విచారణ సాగుతున్నట్లు అన్నాడీఎంకే తీవ్ర ఆరోపణ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ఊటీ సెషన్స్ కోర్టుకు విచారణ నిమిత్తం నిందితులిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు భద్రత కల్పించాలని సయన్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. ఇద్దరు పోలీసుల్ని నియమించారు. కాగా కోర్టుకు పోలీసులు ఓ నివేదికను అందజేశారు.
ఈ కేసు విచారణ ముగియలేదని, పలువురికి సంబంధాలు ఉన్నట్టుగా పేర్కొంటూ, విచారణ మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కోర్టుకు తెలియజేశారు. కాగా అక్టోబరు 1వ తేదీకి న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. పోలీసులిచ్చిన నివేదికలో పలువురు వీఐపీల పేర్లు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో వీరందర్నీ విచారణ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉ న్నాయి.
అలాగే, కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్‌తో పాటుగా మరో ఇద్దరు విచారణకు హాజరుకావాలని కోర్టు గత వాయిదాలో సమన్లు జారీ చేసింది.అయితే, ఆ ముగ్గురు ప్రస్తుతం విచారణకు డుమ్మా కొట్టారు. కాగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించేందుకు గాను.. డీఎస్పీ చంద్రశేఖర్, ఏడీఎస్పీ కృష్ణమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment