ఎటూ తేల్చని కెప్టెన్!
సాక్షి, చెన్నై : ఏ విషయాన్ని త్వరితగతిన తేల్చని డీఎండీకే అధినేత విజయకాంత్, ఎన్నికల పొత్తుల్లోనూ అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. కూటమి అంశాన్ని మరో నెలన్నర రోజులు సాగ దీయడానికి సిద్ధమయ్యారు. బీజేపీ, ప్రజా కూటముల్ని ఊరిస్తూనే, అన్నాడీఎంకే నిర్ణయం మేరకు డీఎంకేతో చెలిమికి వ్యూహ రచన చేస్తున్నారు.
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు దూకుడు ఎక్కువే. విమర్శలు, ఆరోపణలు గుప్పించేటప్పుడు గానీ, అనుచరులు ఏ చిన్న తప్పు చేసినా చితక్కొట్టడంలో గానీ ఈ దూకుడును ప్రదర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక, ఏదేని నిర్ణయం తీసుకోవాలంటే అందరితోనూ చర్చించడం, చివరకు కింది స్థాయి కార్యకర్త అభిష్టాన్ని తీసుకున్నాకే వెల్లడించడం చేస్తూ వస్తున్నారు. అదే బాణిని ప్రస్తుతం అనుసరించే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో తన మద్దతు కీలకం కావడం, తన చుట్టూ రాజకీయం సాగుతుండడం విజయకాంత్‌కు లోలోన ఆనందం కలిగిస్తోంది.
అయితే, గత ఎన్నికల్లోలా కాకుండా, ఈ సారి పొత్తు వ్యవహారంలో ఆచితూచి స్పందించాలని నిర్ణయించారు. శనివారం పెరంబలూరు వేదికగా జరిగిన పార్టీ సమాలోచన సమావేశం, సర్వ సభ్యం భేటీలో ఇందుకు తగ్గ వ్యూహాల్ని రచించి ఉన్నారు. ఈ సమావేశంలో పార్టీ వర్గాలు మెజారిటీ శాతం మంది విజయ కాంత్‌ను సీఎంగా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినా, అందుకు తగ్గ పరిస్థితులు రాష్ట్రంలో ఉందా..?, ఇది సాధ్యమేనా ..? అన్న ప్రశ్న కెప్టన్ మదిలో మెదులుతున్నట్టు సమాచారం.
బీజేపీ లేదా ప్రజా కూటమిలతో కలసి పనిచేస్తే వచ్చే ఫలితాలు, డీఎంకేతో చెలిమికి సిద్ధ పడితే, వచ్చే లాభ నష్టాలపై ఈ సమావేశంలో కెప్టెన్ బేరిజు వేసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పొత్తు అన్న అంశాన్ని మరికొన్నాళ్లు తేల్చకుండా ఉండేందుకు నిర్ణయించడంతో పాటుగా తన వ్యూహాల్లో ఒకొక్కటి అమలుకు సిద్ధమైనట్టున్నారు. ముందుగా బీజేపీ, ప్రజా కూటమిల మదిలో తన మీదున్న అభిప్రాయాన్ని పసిగట్టేందుకు వీలుగానే, సీఎం ఆకాంక్షతో తాను ఉన్నట్టు ప్రకటించుకుని ఉన్నారని చెబుతున్నారు. ఆ రెండు పార్టీల్లో ఎవ్వరో ఒకరు తనను సీఎం అభ్యర్థి గా ప్రకటిస్తే, అందుకు తగ్గట్టు ఆ సమయంలో నిర్ణయం తీసుకునేం దుకు విజయకాంత్ నిర్ణయించి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నా యి.
ప్రజా కూటమిలో ముసలం బయలు దేరి ఉండటం, వీరి వైపు నుంచి వచ్చే స్పందనను, ఆ కూటమిలో సాగే వ్యవహారాలను నిశితం గా పరిశీలించాలని పార్టీ వర్గాలకు కె ప్టెన్ సూచించి ఉన్నారని డీఎండీకే నేత ఒకరు పేర్కొన్నారు. ఇక, అన్నాడీఎంకే నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే బీజేపీకి స్పష్టమైన హామీ ఇవ్వాలని సంకల్పించినట్టు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తన నిర్ణయం ఉంటుందని పొత్తు అంశంపై ఆ పార్టీ అధినేత్రి జయలలిత ప్రకటించి ఉన్న దృష్ట్యా, కమలం అడుగుల్ని సైతం నిశితంగా పరిశీలించేందుకు పార్టీ వర్గాల్ని రంగంలోకి దించి ఉన్నారు. ఇక, తన కోసం డీఎంకే తలుపులు తెరుచుకునే ఉన్నందున, ఆ పార్టీని దూరం చేసుకోకుండా ఆచీ తూచి స్పందించేందుకు తగ్గ ఉపదేశాలను పార్టీ వర్గాలకు విజయకాంత్ చేసి ఉండటం గమనార్హం.
తనకు డీప్యూటీ సీఎంతో పాటుగా 70 సీట్లు ఇస్తే డీఎంకేతో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్న నిర్ణయాన్ని పార్టీ వర్గాల ముందు విజయకాంత్ ఉంచినా, పొత్తు అంశంపై అన్నాడీఎంకే వేసే ఎత్తుగడల మేరకు డీఎంకేతో చెలిమి అన్న విషయాన్ని స్పష్టం చేసినట్టు మరో నేత పేర్కొనడం గమనార్హం. అందుకే పొత్తు అంశాన్ని మరో నెలన్నర రోజులు సాగదీయడానికి నిర్ణయించి, ఫిబ్రవరి చివరి వారం లేదా, మార్చి మొదటి వారంలో పార్టీ మహానాడుకు కసరత్తుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ మహానాడు వేదికగా అందరి అభీష్టం మేరకు మార్చి రెండు లేదా, మూడో వారం విజయకాంత్ తన నిర్ణయాన్ని చెబుతారని, అంత వరకు అందరితోనూ మంతనాల పర్వం సాగాల్సిందేనని పేర్కొనడం గమనించాల్సిన విషయం.