మూడు గుడ్‌బైలు | Crisis in Public Welfare Alliance | Sakshi
Sakshi News home page

మూడు గుడ్‌బైలు

Published Tue, Jun 7 2016 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

మూడు గుడ్‌బైలు - Sakshi

మూడు గుడ్‌బైలు

వైదొలగాలని డీఎండీకే, తమాకా, వీసీకే నిర్ణయం
 వాసన్, విజయకాంత్, తిరుమా వెల్లడి
 
 అసెంబ్లీ ఎన్నికల సమయంలోఎన్నో ఆశలతో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమి సంక్షోభంలో పడిపోయింది. ఎన్నికలు ముగిసి ముప్పైరోజులు కూడా కాకుండానే మూడు పార్టీలు కూటమికి గుడ్‌బై చెప్పేశాయి.
 
 సాక్షి ప్రతినిధి, చెన్నై:   తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోగా డీఎంకే, అన్నాడీఎంకేలే ప్రభుత్వ పగ్గాల కోసం పోటీపడుతున్నాయి. సుమారు ఐదు దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలదే పెత్తనంగా మారింది. మూడో అతిపెద్ద పార్టీగా పుట్టుకొచ్చిన డీఎండీకే ఒంటరిగా తన సత్తాను చాటలేక చతికిలబడింది. డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి గండికొట్టడమే లక్ష్యంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాసంక్షేమ కూటమి ఆవిర్భవించింది. కూటమి ఏర్పాటుకు మూలకర్తై  ఎండీఎంకే అధినేత వైగో  అనేక పార్టీలను కూటమిలో చేర్చే బాధ్యతలను చేపట్టారు.
 
  వీసీకే, వామపక్షాలు కూటమిలో చేరిపోయాయి. ఆ తరువాత డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ డీఎంకే కూటమివైపు మొగ్గుచూపుతూనే సంక్షేమ కూటమిలో చేరిపోయారు. అన్నాడీఎంకేతో పొత్తు కోసం పాకులాడిన తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ సైతం గత్యంతరం లేక సంక్షేమ కూటమి తీర్థం పుచ్చుకున్నారు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్‌ను రంగంలోకి దించారు. అత్యధిక పార్టీలు కలిగిన కూటమిగా తాము అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం చేసుకున్నారు. తీరా ఓట్ల లెక్కింపు రోజున వెల్లడైన ఫలితాల్లో సంక్షేమ కూటమికి శృంగభంగమే మిగిలింది.
 
  సంక్షేమ కూటమి నుంచి పోటీ చేసిన 234 మంది అభ్యర్థుల్లో ఒక్కరూ గెలవలేదు. కూటమిలోని వివిధ పార్టీ అధ్యక్షులు ఘోరపరాజయం పాలైనారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ ఏకంగా డిపాజిట్టునే కోల్పోయారు. కనీస శాతం ఓట్లు కూడా సాధించలేకపోయిన కూటమిలోని పార్టీలు చివరకు ఎన్నికల కమిషన్ గుర్తింపునే కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. కూటమి ఓటమితో పార్టీ నేతలు పోస్టుమార్టం చేసుకున్నారు. ఓటమిపై ఒకరికొకరు నిందించుకున్నారు. కూటమి నుంచి వైదొలగాలంటూ ఆయా పార్టీ నేతలపై ఒత్తిళ్లు పెరిగాయి. ఇదిలా ఉండగా, కూటమి నుంచి డీఎండీకే, తమాకా వెళ్లిపోయినా నష్టం లేదంటూ ఇటీవల జరిగిన ఎండీఎంకే నిర్వాహకుల సమావేశంలో వైగో వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని వైగో కూడా ఖండించలేదు.
 
 కూటమికి బై: జీకే వాసన్
 సంక్షేమ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ సోమవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మూడు దశలుగా పార్టీ సమావేశమైందని తెలిపారు. సోమవారం రాష్ట్రస్థాయి నిర్వాహకులతో సమావేశం అయ్యామని చెప్పారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి విశ్లేషించుకున్నామని అన్నారు. ఈ నెల 11వ తేదీన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తామని తెలిపారు. సంక్షేమ కూటమి నుంచి వైదొలగాలన్న నేతల అభిప్రాయంతో ఏకభవిస్తూ కార్యవర్గ సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నట్లు వాసన్ నర్మగర్భంగా తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలు సైతం కూటమికి గుడ్‌బై చెప్పనున్నట్లు స్పష్టం చేశారు.
 
 విజయకాంత్ సిద్ధం
 సంక్షేమ కూటమి నుంచి వైదొలిగితేనే డీఎండీకే నిలబడుతుందనే స్థాయిలో ఒత్తిళ్లను విజయకాంత్ ఎదుర్కొంటున్నారు. ఓటమి కారణాలపై పార్టీ సమావేశంలో పోస్టుమార్టం నిర్వహించగా అందరూ సంక్షేమ కూటమినే నిందించారు. ఎన్నికల బూత్ నిర్వహణకు ఏజెంట్లకు కూటమి నుంచి కనీస ఆర్థిక సాయం అందలేదని, ఉన్న ఆస్తులను పణంగాపెట్టి నడిరోడ్డులో నిలుచున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో ఒక్కో అభ్యర్థికి రూ.10 లక్షలు చెల్లించాలని విజయకాంత్ నిర్ణయించుకున్నారు.
 
 ఇదిలా ఉండగా డీఎండీకే నుంచి వేరుపడిన మక్కల్ డీఎండీకే పెట్టుకున్న నేతలు మరింత మందిని తమవైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దుష్పరిణామాల నుంచి బైటపడేందుకు కూటమి నుంచి వీలైనంత త్వరగా బైటపడాలని విజయకాంత్ నిర్ణయించకున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేత సోమవారం తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.
 
 ‘స్థానికం’లో ఒంటరి పోరు: తిరుమా
 రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సంక్షేమ కూటమి అవసరం ఎంతమాత్రం లేదని, ఒంటరిగా బరిలోకి దిగుతామని  వీసీకే అధినేత తిరుమావళవన్ సోమవారం ప్రకటించారు. సంక్షేమ కూటమితో తెగదెంపులకు సిద్ధం అవుతున్నామని అన్నారు. తాను పోటీ చేసిన కాట్టుమన్నార్ కోవిల్‌లో ఓట్లను మరోసారి లెక్కించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement