తెలుగోడి సత్తా ఎంత?
♦ తమిళ బరిలో తెలుగు ఓటర్ల కరుణ కోసం పార్టీల ఎత్తులు
♦ పలువురు తెలుగు అభ్యర్థులను బరిలోకి దించిన డీంఎంకే, అన్నాడీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాట ఏ రంగమైనా తెలుగువారి ముద్ర కచ్చితంగా ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంగా కలిసున్నప్పటి నుంచి ఇప్పటివరకూ రాజకీయాలతో పాటు కళలు, వాణిజ్యం ఇలా అన్నింట తెలుగు ప్రజలు తళుక్కుమంటూనే ఉన్నారు. ఇక ఎన్నికలొస్తే మన వారి సందడి అంతా ఇంతా కాదు. తెలుగును అణగదొక్కే ప్రయత్నాలు సాగినా, ఎన్నికల్లో తెలుగు ఓటరు ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పక్షాలు మాత్రం కుస్తీలు పడతాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇక తెలుగువారు ఎక్కువ గా ఉన్న చోట వారినే అభ్యర్థులుగా ప్రకటించాయి ప్రధాన పార్టీలు. తమిళ రాజకీయాల్లో తెలుగు వారి ఆధిపత్యం మొదటి నుంచి కొనసాగుతోంది. మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి నుంచి డీఎండీకే నేత విజయ్‌కాంత్ వరకు తమిళ రాజకీయాల్లో మన వాళ్లు చక్రం తిప్పుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పూర్వీకులు తమిళనాడులో స్థిరపడిన తెలుగువారే. ఆ పార్టీలోని ఆర్కాడు వీరాస్వామి, కేఎన్ నెహ్రూలు, కాంగ్రెస్‌కు చెందిన కృష్ణస్వామి, చిరంజీవి, గోపీనాథ్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోలు కూడా మనవాళ్లే.
చెన్నైలోని 7 స్థానాల్లో మనవాళ్లే కీలకం..
చెన్నైలో తెలుగు సంతతి ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. నగరంలోని రాయపురం, తిరువొత్తియూరు, పెరంబూరు, కొళత్తూరు, విల్లివాక్కం, హార్బర్, అన్నానగర్, ఆర్కేనగర్ స్థానాల్లో వీరు అధికం. వారిని ఆకర్షించేందుకు తెలుగువారైన శేఖర్‌బాబు(హార్బర్), రంగనాథన్ (విల్లివాక్కం), మోహన్ (అన్నానగర్)లను డీఎంకే బరిలో నిలిపింది. ఆవడి, తాంబరం, పల్లావరంలోనూ తెలుగు ఓటర్లు అధికమే. పల్లావరం అభ్యర్థిగా తెలుగువారైన నటి సీఆర్ సరస్వతిని అన్నాడీఎంకే పోటీకి పెట్టింది.
సరిహద్దు జిల్లాలోను మన రాజకీయమే
ఏపీ సరిహద్దుల్లోని తిరువళ్లూరు, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోను మనవాళ్ల ప్రభావం ఎక్కువే. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, తిరుత్తణి, కృష్ణగిరి జిల్లా హొసూరు, తలి, వేపనహల్లి, ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టిల్లో తెలుగు ఓటరే కీలకం. గుమ్మిడిపూండిలో తెలుగువాడైన శేఖర్ డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి తెలుగు నేత మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ రేసులో ఉన్నారు. తిరుత్తణి నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి నాయుడు, ప్రజా సంక్షేమ కూటమి నుంచి డీఎండీకే అభ్యర్థిగా కృష్ణమూర్తినాయుడు బరిలో ఉన్నారు. హోసూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపీనాథ్ తమిళ అసెంబ్లీలో తెలుగు వాణి విన్పిస్తున్నారు. ఆర్కేనగర్‌లో సీఎం జయలలితను తమిళనాడు తెలుగు యువశక్తి చీఫ్ జగదీశ్వరరెడ్డి ఢీకొంటున్నారు.
జయ, కరుణలకు ఈసీ నోటీసులు
ఈ నెల16న ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ప్రచారం శనివారంతో ముగిసింది. తమిళనాడులోని అరవకురిచి స్థానంలో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టారన్న ఆరోపణలతో ఈసీ ఎన్నికను ఈ నెల 23కు వాయిదా వేసింది. పార్టీల మేనిఫెస్టోలు ఈసీ నిబంధనల మేరకు లేవని అన్నాడీఎంకే అధినేత్రి జయ, డీఎంకే చీఫ్ కరుణానిధికి ఈసీ నోటీసులు జారీచేసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణివ్వాలని పేర్కొంది.