రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చతుర్మఖ పోటీ నెలకొంది.
► ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే,
► డీఎంకేలే ప్రధాన ప్రత్యర్థులు
► బీజేపీ అభ్యర్థుల ఎంపిక
► పోలింగ్ సమయం కుదింపు
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో చతుర్మఖ పోటీ నెలకొంది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టారనే ఆరోపణలతో అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దయిన విషయం తెలిసిందే. తిరుప్పరగున్రం ఎమ్మెల్యే శీనివేల్ మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు వచ్చే నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. అన్నా డీఎంకే, డీఎంకే, పీఎంకే ఇప్పటికే తవ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగాయి.
బీజేపీ అభ్యర్థులు వీరే : మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ గురువారం ఢిల్లీ నుంచి ప్రకటించింది. తంజావూరు నుంచి ఎమ్‌ఎస్.రామలింగం, అరవకురిచ్చి నుంచి ఎస్.ప్రభు, తిరుప్పరగున్రం నుంచి ప్రొఫెసర్ శ్రీనివాసన్ పోటీకి దిగుతున్నారు.
ఫిర్యాదులు, పిటిషన్లు : ఉప ఎన్నికలు జరగనున్న మూడు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు డీఎంకే ఫిర్యాదు చేసింది. గడిచిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులనే అన్నాడీఎంకే, డీఎంకే తదితర పార్టీలు మళ్లీ పోటీకి దింపినందున తంజావూరు, అరవకురిచ్చిల్లో ఉప ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు శాఖలో సీనియర్ న్యాయవాది ప్రకాష్ గురువారం పిటిషన్ వేశారు.
పోలింగ్ సమయం కుదింపు : తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చీలో వచ్చే నెల 19న జరగనున్న ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పాటూ కుదించనున్నట్టు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని గతంలో ప్రకటించి ఉన్నారు. తాజాగా పోలింగ్ వేళలను సవరిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
నేడు అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల నామినేషన్లు : ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజవర్గాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అరవకురిచ్చీలో సెంథిల్ బాలాజీ(అన్నాడీఎంకే), కేసీ.పళని స్వామి, తంజావూరులో రంగస్వామి(అన్నాడీఎంకే), అంజుగం భూపతి(డీఎంకే), తిరుప్పరగున్రంలో ఏకే.బోస్ (అన్నాడీఎంకే), డాక్టర్ శరవణన్(డీఎంకే) నా మినేషన్లు వేయనున్నారు. రెండు పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం 1-3 గంటల మధ్యలో నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.