సినిమా వాళ్లే ముఖ్యమంత్రి కావాలా?
వేలూరు: సినిమా నుంచి వచ్చిన వారే ముఖ్యమంత్రి కావాలా చదివిన వారికి ఒక్కసారి అవకాశం కల్పించాలని పాట్టాలి మక్కల్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రామదాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పామాకా ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాల అభ్యర్థుల పరిచయ కార్యక్రమం వేలూరులో శుక్రవారం రాత్రి జరిగింది. అన్బుమణి మాట్లాడుతూ ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రతిఒక్కరిని వేడుకుంటున్నానని ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని తెలిపారు.
గత 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో మార్చి మార్చి పాలన చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అవసరం లే దని రాష్ట్రంలో మార్పు అవసరమని ఆ మార్పు అన్బుమణితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాష్ర్టంలో ఎవరితోనూ కూటమి పెట్టుకోకుండా పోటీ చేస్తున్న పార్టీ పామాకా మాత్రమే అన్నారు. తమకు ఎవరూ వ్యతిరేకం కాదని రాష్ట్రంలో ఒక్కసారి అన్బుమణికి అవకాశం కల్పించండి, పాలన సక్రమంగా చేయకుంటే రెండేళ్లోనే తాను రాజీనామా చేస్తానన్నారు. జయలలిత ప్రచార సమావేశంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారని ఇందుకు జయలలితపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు.
రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్నా మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం ఎన్నికలు రావడంతో మద్య నిషేధం జపం చేస్తున్నారన్నారు. పామాకా అధికారానికి వస్తే ఒక చుక్క కూడా మద్యం రాష్ట్రంలో ఉండదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తనకు ఒక్కసారి అవకాశం కల్పించండి, ప్రతి నియోజక వర్గంలోనే తాను పోటీ చేస్తున్నట్లుగా భావించి మామిడి పండు చిహ్నంపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థులను పరిచయం చేశారు. వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాలకు చెందిన పామాకా అభ్యర్థులు పాల్గొన్నారు.