Makkal Party
-
తలైవా రజనీ.. టార్గెట్ 180
సాక్షి, చెన్నై : దేనికైనా సిద్ధం అని ప్రకటించిన తలైవా రజనీకాంత్, తాజాగా రాష్ట్రంలో 180 అసెంబ్లీ నియోజకవర్గాల మీద తన గురిని పెట్టినట్టు సంకేతాలువెలువడ్డాయి. ఇక, తలైవా అభిమాన సేన ఆ నియోజకవర్గాల్లో తమ కార్యక్రమాల్ని విస్తృతం చేయడానికి సిద్ధం అయ్యాయి. ఇంటింటా తిరుగుతూ ప్రజా మద్దతు సేకరణకు రెడీ అవుతున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రజనీ కాంత్ పార్టీ కసరత్తులు మీద వేగాన్ని పెంచారు. అయితే, పార్టీ ఎప్పుడు అన్నది మాత్రం ఆయన స్పష్టం చేయడం లేదు. పార్టీ తెర మీదకు వచ్చేలోపు రజనీ మక్కల్ మండ్రం బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. జిల్లాల వారీగా కమిటీలను, అనుభంద విభాగాలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగ వంతంచేశారు. రజనీ రాజకీయ పార్టీని ప్రకటించినానంతరం ఎన్నికలు వస్తే కనీసం 150 స్థానాల్లో ఆయనకు పలుకు బడి పెరిగినట్టే అని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేసింది. దీని గురించి రజనీని కదిలించినప్పుడు నిజంగా జరిగితే సంతోషం అని సమాధానం ఇచ్చారు. అయితే, రజనీ కాంత్ ఆ 150 స్థానాలతో పాటుగా మరోముఫ్పై స్థానాల మీద తన దృష్టిని పెట్టి ఉన్నారు. రాష్ట్రంలో ఆ స్థానాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో మార్పు యోచనలో ఉన్నట్టుగా ఇప్పటికే రహస్య సర్వే ద్వారా సమాచారాన్ని సేకరించి ఉండడం గమనార్హం. అక్కడిప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతుల్ని చేయడం, మార్పు లక్ష్యంగా వారి ద్వారా ఓటు బ్యాంక్‌ను సాధించడం లక్ష్యంగా కొత్త వ్యూహాలకు సిద్ధమై ఉన్నారు. 34 శాతం మేరకు అభిమానులు : రాష్ట్రంలో మొత్తంగా 34 శాతం మేరకు రజనీ అభిమానులు ఉన్నట్టు గుర్తించి ఉన్నారు. వీరిలో ముఫ్పైశాతం మంది రజనీ వెన్నంటి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇక, తాజాగా ఓటర్ల జాబితాలో పదిహేను శాతం మంది కొత్త ఓటర్లు ఉన్నట్టు సమాచారాన్ని సేకరించారు. తన అభిమాన లోకం చేజారకుండా ఉండటంతో పాటుగా కొత్త ఓటర్లను మార్పు నినాదంతో తన వైపునకు తిప్పుకునే రీతిలో కార్యక్రమాలకు తలైవా సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. తన అభిమాన లోకం, కొత్త ఓటర్లలో పది శాతం మంది కలిసి వచ్చినా 40 శాతం గ్యారంటీ అన్న ధీమాతో ఉండటమే కాదు, వారిని రక్షించుకునేందుకు తగ్గట్టుగా ప్రత్యేక కార్యచరణతో అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. యువతను, గ్రామీణ ఓట్లను చీల్చినా 180 స్థానాల్లో గ్యారంటీగా బలాన్ని చాటుకోవచ్చన్న ధీమాతో ఉన్న సూపర్‌స్టార్ రజనీ కాంత్, ముందుగా తన అభిమాన సేనను ఇంటింటా పంపించేందుకు ఆయన సిద్ధం అయ్యారు. ఇక,అభిమాన లోకం ఇంటింటా తిరుగుతూ, ప్రజల్ని ఆకర్షించడమే కాదు, వారి మదిలో ఉన్న అభిప్రాయాల్ని సేకరించేందుకు ఉరకలు తీయనున్నారు. తద్వారా ముందస్తుగా ప్రజా మనోగతాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ ప్రకటన నిర్ణయం తథ్యమని రజనీ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మక్కల్ మండ్రం వర్గాలు పేర్కొంటున్నారు. ప్రజా మనో గతం తమకు అనుకూలంగా పూర్తిస్థాయిలో ఉన్న పక్షంలో, లోక్‌సభ ఎన్నికల నగారా మోగగానే పార్టీ ప్రకటన తథ్యమని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
మగువ 'ధీర'
‘‘మహిళా శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తథ్యం. నారీమణులకు ఎక్కడ ప్రాధాన్యత ఉంటుందో అక్కడలా ప్రగతి ,అభివృద్ధి రెట్టింపు అవుతుంది. అందుకేమా పార్టీలో మహిళలకు కీలకంగాప్రాధాన్యతను కల్పించబోతున్నాం’’ అనిదక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్రజనీ కాంత్ వ్యాఖ్యానించారు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్ణయాన్ని ప్రకటించి తీరుతానని స్పష్టం చేశారు. ఆదివారం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ఆయన మహిళా విభాగం నేతలతో భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై : మక్కల్ మండ్రం బలోపేతం తదుపరి పార్టీ ప్రకటనకు తగ్గ కార్యాచరణతో రజనీ కాంత్ ముందుకు సాగుతున్నారు. అమెరికా పర్యటన తదుపరి ఆయన పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రజనీ మక్కల్ మండ్రం వర్గాలతో, యువజన విభాగంతో భేటీలు ముగించారు. తాజాగా, మహిళా విభాగంతో సమావేశమయ్యారు. తదుపరి మక్కల్ మండ్రం నిర్వాహకులందరినీ ఒక చోట చేర్చి కీలక ప్రకటనకు సన్నద్ధం అవుతున్నారు. మహిళా విభాగంతో సమాలోచన రాజకీయ పయనంలో భాగంగా మహిళా విభాగంతో పోయెస్ గార్డెన్ వేదికగా రజనీ కాంత్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో మక్కల్ మండ్రంలో నిర్వాహులుగా ఉన్న మహిళా నేతలకు ఉన్న రాజకీయ అవగాహన, సమస్యలపై వారి స్పందన, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, స్థానికంగా ప్రజలతో మమేకం అయ్యే రీతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై రజనీకాంత్ చర్చించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లోని సమస్యలు, మక్కల్ మండ్రంలో సభ్యత్వం, ప్రగతి, బలోపేతం గురించి వివరించారు. ఆయా పార్టీల్లోని మహిళా నేతలకు దీటుగా తాము సైతం దూసుకెళ్లగలమని ధీమా వ్యక్తంచేస్తూ రజనీ కాంత్‌కు మహిళా లోకం హామీ ఇచ్చింది. ఈ భేటీ అనంతరంమహిళా నేతలతో రజనీ కాంత్ ఫొటోలు దిగారు. అనంతరం వారితో కలసి మీడియా ముందుకు వచ్చారు. మహిళలకు పెద్ద పీట మక్కల్ మండ్రంకు మహిళా శక్తి ఆదరణ మెండుగా ఉందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తంచేశారు. నారీమణులు అత్యధికంగా ఎక్కడ ఉంటారో అక్కడ విజయం త«థ్యమన్నారు. మహిళా శక్తి ఇస్తున్న ఉత్సాహం, ప్రోత్సాహం, చూపుతున్న అభిమానం, భరోసా చూస్తుంటే, ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత కల్పిస్తారో అక్కడ ప్రగతి, అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. అందుకే మక్కల్మండ్రంలోను, తాను ప్రకటించబోయే పార్టీలోను మహిళలకు కీలక ప్రాధాన్యత, బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించారు. వారి సేవల్ని ఉపయోగించుకుంటామన్నారు. ప్రజా స్వామ్య విజయం కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని రజనీ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర గవర్నర్ తీరును తప్పుబడుతూ, సుప్రీంకోర్టు సకాలంలో స్పందించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా, బల పరీక్షకు పదిహేను రోజుల అవకాశాన్ని గవర్నర్ కల్పించడం శోచనీయమని విమర్శించారు. అయితే, కోర్టు జోక్యం తదుపరి చోటుచేసుకున్న పరిణామాలతో సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు కుమారస్వామి సిద్ధం అవుతుండడం ప్రజా స్వామ్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. కావేరి వ్యవహారంలో కమిషన్ అన్నది ఏమేరకు ఫలితాల్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కర్ణాటకలోని జలాశయాల్ని ఆ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కమిషన్‌లో రాజకీయ జోక్యం ఉండేందుకు ఆస్కారం ఉందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..? అని ప్రశ్నించగా, అలాగే అనుకోండి అని సమాధానం ఇచ్చారు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ఎన్నికల తేదీలు ఎప్పడు ప్రకటించినా, ఆ సమయంలో కీలక నిర్ణయంతో ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబరు 31వ తేదీనే తాను స్పష్టంచేశానని, ఎన్నికల గంట ఎప్పుడు మోగినా, రెడీ అని ప్రకటించారు. అన్ని సిద్ధం చేసుకునే ఉన్నామని, ఎలాంటి ఎన్నికలకైనా ఎదుర్కొంటామని ముగించారు. -
యూట్యూబ్‌లో తలైవా
రాజకీయ పార్టీ కసరత్తుల్లో ఉన్న రజనీకాంత్ తనకంటూ ఓ చానల్‌కు సిద్ధం అయ్యారు. సామాజిక మాధ్యమాలకు ప్రస్తుతం క్రేజ్ పెరిగిన దృష్ట్యా, తన చానల్‌ను యూట్యూబ్ చానల్‌గా తీసుకొచ్చే పనిలో పడ్డారు. మక్కల్ మండ్రం వ్యవహారాలన్నీ అందులోకి అప్లోడ్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు. సాక్షి,చెన్నై : తాను రాజకీయాల్లోకి వచ్చేశా అని దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించి నాలుగు నెలలు అవుతోంది. ప్రత్యేక పార్టీతో ప్రజల్లోకి అని ప్రకటించి, అందుకు తగ్గ కసరత్తుల్లో తలైవా నిమగ్నమై ఉన్నారు. పార్టీ కన్నా ముందుగా, తన అభిమాన సంఘాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. రజనీ మక్కల్ మండ్రం పేరుతో అభిమాన సంఘాల్ని ఏకంచేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాలకు మక్కల్ మండ్రం కార్యవర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. సభ్యత్వ నమోదు జోరుగానే సాగుతోంది. తరచూ మీడియా ముందుకు వచ్చి స్పందిస్తూ వస్తున్న రజనీకాంత్, ఇక, తన సందేశాలు, పిలుపులన్నీ యూట్యూబ్ ద్వారా అభిమానులకు చేరవేయడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. రజనీ యూట్యూబ్ చానల్ రజనీకాంత్ ఇప్పటికే మక్కల్ మండ్రం పేరిట ఓ వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మండ్రం నిర్వాహకులకు, సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఆ వెబ్సైట్ ద్వారా అప్పుడప్పుడూసందేశాల్ని ఇస్తున్నారు. అయితే, రాజకీయంగా పార్టీతో తెరమీదకు రానున్న రజనీకి మరింత ప్రచారం తప్పనిసరిగా మారింది. దీంతో సామాజిక మాధ్యమాల మీద రజనీ దృష్టి పెట్టారు. దీనికి ప్రస్తుతం క్రేజ్ మరీ ఎక్కువగా ఉండడంతో రజనీ మక్కల్ మండ్రం పేరిట యూ ట్యూబ్ చానల్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇందులో ఎప్పటికప్పుడు రజనీకాంత్ సందేశాలు, పిలుపులు, కార్యక్రమాలు, అన్ని రకాల వివరాలను తెలియజేయనున్నారు. అలాగే, రజనీ మక్కల్ మండ్రం ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలను ఇందులోకి అప్లోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ చానల్‌ను తెరమీదకు తెస్తూ లాంఛనంగా ఆదివారం జరిగిన రజనీకాంత్ ప్రెస్ మీట్‌ను పదేపదే ప్రసారం చేస్తుండడం గమనించ దగ్గ విషయం. ఇదిలా ఉండగా, కేంద్రంపై దుమ్మెత్తి పోస్తూ ఆదివారం రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్‌ను సూపర్ స్టార్ చేసింది తమిళులు అన్న విషయాన్ని ఆయన మరవకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. అయితే, కేంద్రాన్ని హెచ్చరించే రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక, కేంద్రం తీరుపై నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై సైతం ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. -
జిల్లాకు ఐదు లక్షల మంది..
సాక్షి, చెన్నై : మక్కల్ మండ్రంలో జిల్లాకు ఐదు లక్షల మంది చొప్పున సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా తలైవా రజనీ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగా అడుగుల వేగాన్ని పెంచారు. చెన్నైలో శుక్రవారం మక్కల్ మండ్రం ఏర్పాటు కాగా, ఇక అన్ని జిల్లాల్లో ఈ మండ్రం విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీ ఏర్పాటు కసరత్తుల్లో బిజీబిజీగా ఉన్న రజనీకాంత్, ముందుగా తన అభిమానుల్ని ఏకం చేస్తూ, మద్దతుదారుల్ని, ప్రజల్ని ఆకర్షించే విధంగా రజనీ మక్కల్ మండ్రంను కథానాయకుడు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో సభ్యులను చేర్చేందుకు అభిమాన లోకం ఉరకలు పరుగులు తీస్తూ వస్తున్నాయి. అదే సమయంలో అభిమానులకు ఎలాంటి పదవులు ఆ మండ్రంలో లేని దృష్ట్యా, అందుకు తగ్గ కార్యాచరణపై రజనీ దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా రజనీ మక్కల్ మండ్రంకు కార్యవర్గాలను ప్రకటించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తూ వస్తున్నారు. ఇందులో మైనారిటీలు, దళిత సామాజికవర్గానికి చెందిన వారికి పెద్ద పీట వేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాల మేళవింపుతో ఈ కార్యవర్గాలు ఉండే విధంగా చర్యలు తీసుకునే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా జిల్లాకు కనీసం ఐదు లక్షల మంది సభ్యుల్ని ఈ మండ్రంలో చేర్పించడం, ఈ లక్ష్యాన్ని జిల్లాల్లో చేరిన అనంతరం పార్టీ ప్రకటనను రజనీ చేసే అవకాశాలు ఉన్నట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ ఐదులక్షల మంది ద్వారా పార్టీ సభ్యత్వాన్ని మరింత విస్తృతం చేయడానికి వీలు ఉంటుందన్న భావనతో రజనీ అడుగుల వేగంగా సాగుతున్నట్టు చెబుతున్నారు. చెన్నైలో మక్కల్ మండ్రం: ఇక, శుక్రవారం చెన్నైలో మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. చేట్‌పేట్‌లోని మంగళాపురంలో ఈ మండ్రంను ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులు రాందాసు, సూర్య, రవి, రజనీ సెల్వం ఇందులో పాల్గొన్నారు. ఇక, తిరుప్పూర్‌లోని రజనీ అభిమానుల్ని ఏకం చేస్తూ సమావేశం సాగింది. రజనీ మక్కల్ మండ్రంకు తిరుప్పూర్‌లో ఇప్పటి వరకు రెండున్నర లక్షల మంది సభ్యులు చేరినట్టు, మరో రెండున్నర లక్షల్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అభిమానులు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
సినిమా వాళ్లే ముఖ్యమంత్రి కావాలా?
వేలూరు: సినిమా నుంచి వచ్చిన వారే ముఖ్యమంత్రి కావాలా చదివిన వారికి ఒక్కసారి అవకాశం కల్పించాలని పాట్టాలి మక్కల్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రామదాస్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పామాకా ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాల అభ్యర్థుల పరిచయ కార్యక్రమం వేలూరులో శుక్రవారం రాత్రి జరిగింది. అన్బుమణి మాట్లాడుతూ ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రతిఒక్కరిని వేడుకుంటున్నానని ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో మార్చి మార్చి పాలన చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అవసరం లే దని రాష్ట్రంలో మార్పు అవసరమని ఆ మార్పు అన్బుమణితోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రాష్ర్టంలో ఎవరితోనూ కూటమి పెట్టుకోకుండా పోటీ చేస్తున్న పార్టీ పామాకా మాత్రమే అన్నారు. తమకు ఎవరూ వ్యతిరేకం కాదని రాష్ట్రంలో ఒక్కసారి అన్బుమణికి అవకాశం కల్పించండి, పాలన సక్రమంగా చేయకుంటే రెండేళ్లోనే తాను రాజీనామా చేస్తానన్నారు. జయలలిత ప్రచార సమావేశంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారని ఇందుకు జయలలితపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్నా మద్యనిషేధం గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం ఎన్నికలు రావడంతో మద్య నిషేధం జపం చేస్తున్నారన్నారు. పామాకా అధికారానికి వస్తే ఒక చుక్క కూడా మద్యం రాష్ట్రంలో ఉండదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తనకు ఒక్కసారి అవకాశం కల్పించండి, ప్రతి నియోజక వర్గంలోనే తాను పోటీ చేస్తున్నట్లుగా భావించి మామిడి పండు చిహ్నంపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థులను పరిచయం చేశారు. వేలూరు, తిరువణ్ణామలై, క్రిష్ణగిరి జిల్లాలకు చెందిన పామాకా అభ్యర్థులు పాల్గొన్నారు. -
కామన్వెల్త్ను బహిష్కరించాలి
వేలూరు, న్యూస్‌లైన్: శ్రీలంకలో జరిగే కామన్వెల్త్ మహానాడులో భారత ప్రతినిధులు పాల్గొనరాదని అరుంధతి మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు వలసై రవిచంద్రన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీలంకలోని మీడియా ప్రతినిధి ఇసై ప్రియపై లంక సిపాయిలు అతి దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేయడాన్ని చానల్ 4 టీవీ గత వారంలో విడుదల చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలన్నారు. చానల్ 4 విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు గ్రాఫిక్స్ అని శ్రీలంక ప్రభుత్వం పేర్కొనడం దారుణమన్నారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రతినిధులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇసైప్రియ పట్ల ప్రవర్తించిన తీరుపై తమిళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. లంకలో జరిగే మహానాడులో దేశ ప్రతినిధులతో పాటు, ప్రధానమంత్రి కూడా పాల్గొనరాదని రాష్ట్ర వ్యాప్తంగా తమిళులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తమిళల మనోభావాలను కాలరాసి మహానాడులో దేశ ప్రతినిధులు పాల్గొంటే రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2009లో లంకలోని తమిళులను అతి దారుణంగా హత్య చేశారని, విల్లువాయిల్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో సుమారు ఒకటిన్నర లక్షల మంది తమిళులు మృతి చెందారని పేర్కొన్నారు. వీటిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. రాజపక్సేను అంతర్జాతీయ ఖైదీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.