కామన్వెల్త్‌ను బహిష్కరించాలి
Published Mon, Nov 11 2013 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
వేలూరు, న్యూస్‌లైన్: శ్రీలంకలో జరిగే కామన్వెల్త్ మహానాడులో భారత ప్రతినిధులు పాల్గొనరాదని అరుంధతి మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు వలసై రవిచంద్రన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీలంకలోని మీడియా ప్రతినిధి ఇసై ప్రియపై లంక సిపాయిలు అతి దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేయడాన్ని చానల్ 4 టీవీ గత వారంలో విడుదల చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలన్నారు. చానల్ 4 విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు గ్రాఫిక్స్ అని శ్రీలంక ప్రభుత్వం పేర్కొనడం దారుణమన్నారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రతినిధులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇసైప్రియ పట్ల ప్రవర్తించిన తీరుపై తమిళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
లంకలో జరిగే మహానాడులో దేశ ప్రతినిధులతో పాటు, ప్రధానమంత్రి కూడా పాల్గొనరాదని రాష్ట్ర వ్యాప్తంగా తమిళులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తమిళల మనోభావాలను కాలరాసి మహానాడులో దేశ ప్రతినిధులు పాల్గొంటే రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2009లో లంకలోని తమిళులను అతి దారుణంగా హత్య చేశారని, విల్లువాయిల్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో సుమారు ఒకటిన్నర లక్షల మంది తమిళులు మృతి చెందారని పేర్కొన్నారు. వీటిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. రాజపక్సేను అంతర్జాతీయ ఖైదీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Advertisement