కామన్వెల్త్ సమావేశాలపైకన్నెర్ర
Published Fri, Oct 25 2013 3:47 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీలంక పట్ల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై తమిళనాడులోని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన గురువారం కామన్వెల్త్ సమావేశాలే ప్రధానాంశంగా చర్చకు వచ్చింది. పార్టీలన్నీ శ్రీలంక తమిళుల ప్రయోజనాల విషయంలో ఏకతాటిపై నిలిచి కామన్వెల్త్‌ను బహిష్కరించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో
..47..కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపీనాథ్ రెడ్డి
..48..అసెంబ్లీ ప్రాంగణంలో డీఎండీకే ఎమ్మెల్యేలు
మాట్లాడారు. ప్రత్యేక ఈలం కోసం పోరాటం చేస్తున్న తమిళ ప్రజలను అణిచివేయాలనే ఏకైక లక్ష్యంతో 2009లో శ్రీలంక ప్రభుత్వం మారణహోమాన్ని సృష్టించిందని ఆరోపించారు. జెనీవా ఒప్పందాన్ని, అందులోని నిబంధనలను తుంగలో తొక్కిన శ్రీలంక ఉన్మాదానికి వేలాదిమంది తమిళులు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది చెట్టుకొకరు, పుట్టకొకరుగా నిరాశ్రయులుగా మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీలంక సైనికుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఈలం తమిళులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రులపై సైతం బాంబుల వర్షం కురిపించారని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా మానవహక్కుల ఉల్లంఘన కిందికు వస్తుందన్నారు.
శ్రీలంక యద్ధ ఉన్మాదాన్ని ఐక్యరాజ్య సమతిలోని సభ్యదేశాల్లో అధిక శాతం తీవ్రంగా ఖండిచాయన్నారు. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను యుద్ధ ద్రోహిగా పరిగణించి ఐక్యరాజ్య సమితి ముందు దోషిగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఈలం తమిళులు శాంతియుతంగా జీవనం సాగించేలా చర్యలు తీసుకోవాలని, శ్రీలంక దేశంపై ఆర్థిక నిషేధం విధించాలని కోరారు. ఇవే డిమాండ్లపై భారత్ ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తేవాలని కోరుతూ 2011లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశానని, అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం ద్వారా విన్నవించామని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి సాధారణంగా తీసుకోవడమే కాకుండా పరిశీలిస్తానని ముక్తసరిగా సమాధానం ఇవ్వడం బాధాకరమని తెలిపారు.
తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించడం లేదని ఆరోపించారు. కొద్దిశాతం మాత్రమే తమిళ జనాభా కలిగిన కెనెడా దేశం సైతం కామన్వెల్త్ సమావేశాలపై ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. 8 కోట్ల తమిళ జనాభాను కలిగి ఉన్న భారత ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపక పోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. శ్రీలంకలో నవంబర్ 15వ తేదీన నిర్వహిస్తున్న కామన్వెల్త్ మహానాడును భారత్ బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెడుతున్న తీర్మానానికి మానవతా ధృక్ఫథంతో మద్దతుపలకాలని జయ కోరారు.
డీఎంకే తరపున స్టాలిన్, కాంగ్రెస్ తరపున గోపీనాథ్ రెడ్డి, డీఎండీకే తరపున బన్రూటి రామచంద్రన్, సీపీఐ తరపున ఆర్ముగం, ఇతర పార్టీలకు చెందిన సభ్యులంతా శ్రీలంక వైఖరిని, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ప్రసంగించారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ ఉదయం 10.47 గంటలకు సచివాలయానికి వచ్చి అసెంబ్లీ రిజిస్టరులో సంతకం చేశారు. ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ గడిపి వెళ్లిపోయారు.
Advertisement