చోగమ్‌కు సల్మాన్
Published Thu, Nov 14 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
సాక్షి, చెన్నై: శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ (చోగమ్)ను భారత్ బహిష్కరించాల్సిందేనని పట్టుబడుతూ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆగ్రహ జ్వాల రాజుకున్నా, తమకేం పట్టదన్నట్టుగా, తమిళుల మనోభావాల్ని తుంగలో తొక్కుతూ శ్రీలంకకు ప్రతినిధుల బృందాన్ని పంపించేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలో నలుగురు అధికారుల బృందం బుధవారం ప్రత్యేక విమానంలో శ్రీలంక రాజ ధాని కొలంబోకు బయలుదేరి వెళ్లింది. తమిళుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా
శ్రీలంకకు ఈ బృందం వెళ్లడంతో రాష్ట్రంలో ఆగ్రహావేశాలు రగిలాయి. పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రైల్‌రోకోలకు వీసీకే పిలుపునిచ్చింది. అలాగే శ్రీలంక తమిళుల సంక్షేమంపై చోగమ్‌లో తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి తమ కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 17న టెసో సమావేశం కానుంది.
పిటిషన్ తిరస్కరణ
కామన్వెల్త్‌కు భారత్ నుంచి ప్రతినిధులు వెళ్లనీయకుండా స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించింది. కామన్వెల్త్‌ను భారత్ బహిష్కరించాలని కోరుతూ మదురైకు చెందిన న్యాయవాదులు గత వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎనిమిది కోట్ల తమిళ ప్రజల నుంచి ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు కామన్వెల్త్ మహానాడుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆ పిటిషన్‌లో గుర్తు చేశారు. ఈ తీర్మానానికి ఎలాంటి గౌరవం ఇవ్వకుండా, తమిళనాడులో బయలుదేరిన ఆగ్రహ జ్వాలలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని కామన్వెల్త్‌కు భారత్ వెళ్లకుండా స్టేవిధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సెల్వం, రవి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. బుధవారం విచారణ ముగించిన ధర్మాసనం తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఎంపీల రాజీనామా కలకలం
అసెంబ్లీ తీర్మానాలకు కనీస విలువ ఇవ్వని కేంద్రం తీరును నిరసిస్తూ అన్నాడీఎంకే ఎంపీలు రాజీనామా చేయబోతున్నట్టుగా సాగిన ప్రచారం రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది. అన్నాడీఎంకేకు పార్లమెంట్‌లో తొమ్మిది, రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాల్ని కేంద్రం తుంగలో తొక్కడంతో రాష్ట్రంలోని ఇతర పార్టీల్ని ఇరకాటంలో పెట్టడంతో పాటు, ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఒత్తిడి పెంచే విధంగా అన్నాడీఎంకే వ్యూహాన్ని రచించిందన్న ప్రచారం రాష్ట్రంలో హల్ చల్ చేసింది. ఆ పార్టీ ఎంపీలందరూ ఢిల్లీకి హుటాహుటిన పయనమయ్యారని, ప్రధాని మన్మోహన్ నివాసం వద్ద నిరసన తెలిపిన అనంతరం రాజీనామాలు సమర్పించబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సంకేతాలతో స్థానిక మీడియా సైతం హడావుడి సృష్టించడంతో రాజకీయ కలకలం బయలుదేరింది. అన్నాడీఎంకే ఎంపీలు రాజీనామ చేసిన పక్షంలో రాష్ర్ట ప్రజల వద్ద మార్కులు కొట్టేయడం ఖాయమని, ఇక తామెలాంటి నిర్ణయం తీసుకోవాలోనన్న చర్చలో డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు పడ్డారు. చివరకు రాజీనామా తంతు ప్రచారంగా తేలడంతో రాజకీయ కలకలానికి తెరపడ్డట్టు అయింది.
Advertisement
Advertisement