సాక్షి, చెన్నై: ఈలం తమిళులకు మద్దతుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగిన ఉద్యమాల్లో విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఇటీవల ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు ఇవ్వాల్సిందేనన్న నినాదంతో విద్యార్థులు సాగించిన ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఆందోళనలతో కళాశాలలకు సెలవులు ప్రకటించక తప్పలేదు. ప్రస్తుతం ఇసై ప్రియ హత్య దృశ్యాల వెలుగులోకి రావడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ సమావేశాలను భారత్ బహిష్కరించాలనే డిమాండ్‌తో ఉద్యమ ఉద్ధృతానికి విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. తమిళ జాతి విద్యార్థి సమాఖ్య, తమిళనాడు విద్యార్థి సంఘాల నేతృత్వంలో భారీ ఆందోళనలకు విద్యార్థి లోకం సిద్ధమైంది.
చైతన్యయాత్ర: ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకుంటూ విద్యార్థులు సోమవారం చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు కూడగట్టడం లక్ష్యంగా కన్యాకుమారి, తిరునల్వేలి, విరుదునగర్, మదురై, తిరుచ్చి, ధర్మపురి, సేలం, ఈరోడ్, నామక్కల్, చెన్నై, కాంచీపురం నుంచి విద్యార్థి సంఘాలు కాగడాల్ని చేత బట్టి యాత్రకు శ్రీకారం చుట్టాయి. ఈ యాత్రను కూడంకులంలో అణు విద్యుత్ వ్యతిరేక ఉద్యమనేత ఉదయకుమార్ ప్రారంభించారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితుడైన పేరరివాలన్ తల్లి అర్బుదమ్మాళ్ నేతృత్వంలో చెన్నై చేపాక్కంలో యాత్ర మొదలైంది. అనుమతి లేకుండా చేపట్టిన ఈ యాత్రల్ని ఆయా ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం చెందారు. తాంబ రం, పల్లావరం, క్రోంపేట పరిసరాల్లోని కొన్ని కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రైల్‌రోకోలకు యత్నించారు. అలాగే రాష్ట్రంలోని పలుచోట్ల రాస్తారోకోలు, రైల్‌రోకోలు, ధర్నాలతో విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నిరసనలను మంగళవారం నుంచి ఉద్ధృతం చేయడానికి నిర్ణయించారు. చెన్నైలోని రాజ్‌భవన్‌ను ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
రాజకీయ పక్షాల సన్నద్ధం
విద్యార్థులు రంగంలోకి దిగడంతో రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలకు సిద్ధమయ్యాయి. మంగళవారం వీసీకే నేతృత్వంలో నిరసనలకు ఆ పార్టీ నేత తిరుమావళవన్ పిలుపునిచ్చారు. శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ, పెరియార్ ద్రావిడ కళగం, నామ్ తమిళర్ కట్చి, సమత్తువ మక్కల్ కట్చి, తమిళగ మున్నేట్ర కాంగ్రెస్, ఎండీఎంకేలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. నామ్ తమిళర్ కట్చికి చెందిన పదిహేను మంది శివగంగైలో ఆదివారం నుంచి ఆమరణ దీక్షకు కూర్చున్నారు.
కోర్టులో పిటిషన్
కామన్వెల్త్ సమావేశాల్లో భారత్ పాల్గొనడంపై స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఆర్.కుమరన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కామన్వెల్త్ సమావేశాలకు వ్యతిరేకంగా ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. దీనికి గౌరవం ఇవ్వకుండా, తమిళనాడులోని ఆగ్రహజ్వాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల మనోభావాల్ని తుంగలో తొక్కి శ్రీలంకకు వెళ్లేందుకు భారత్ సిద్ధమవుతోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించి కామన్వెల్త్ సమావేశాల్లో భారత్ పాల్గొనకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జయచంద్రన్, వైద్యనాథన్‌తో కూడిన బెంచ్ పరిశీలించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్ మంగళవారం మదురైకు వస్తున్న దృష్ట్యా విచారణను అదే రోజు నుంచి చేపట్టేందుకు బెంచ్ నిర్ణయించింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోనే విచారించేందుకు బెంచ్ నిర్ణయించినట్లు సమాచారం. శ్రీలంకకు భారత్ నుంచి యుద్ధనౌకల పంపిణీకి వ్యతిరేకంగా దాఖలైన మరో పిటిషన్ విచారణను వారుుదా వేశారు.
ప్రధానిపై ఒత్తిడి
కామన్వెల్త్ సమావేశాలకు వెళ్లకూడదంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఒత్తిడి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జయంతి నటరాజన్ పేర్కొన్నారు. ఆమె సోమవారం ఢిల్లీ వెళుతూ మీనంబాక్కం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తమిళుల మనోభావాల్ని అర్థం చేసుకోవాలని అన్ని పక్షాలూ కేంద్రాన్ని కోరుతున్నాయని గుర్తు చేశారు. తామూ ఇదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోరన్న నమ్మకం ఉందన్నారు. వ్యక్తిగతంగా ప్రధానిని కలవనున్నట్లు, కామన్వెల్త్ సమావేశాలకు వెళ్లొద్దని కోరనున్నట్లు వెల్లడించారు.
తమిళ విద్యార్థుల ఉద్యమబాట
Published Tue, Nov 5 2013 3:38 AM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
Advertisement
Advertisement