సాక్షి, చెన్నై : శ్రీలంక సేనల వీరంగానికి బలైన జాలరి రాజ్ కిరణ్ మృతదేహం శనివారం పుదుకోట్టై జిల్లా కోటై పట్నానికి చేరింది. బాధిత కుటుంబానికి సీఎం ఎంకే స్టాలిన్ రూ. పది లక్షలు సాయం ప్రకటించారు. తమిళ జాలర్లపై సముద్రంలో శ్రీలంక సేనల వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత వారం పుదుకోట్టై జిల్లా కోటై పట్నంకు చెందిన జాలర్ల పడవపై శ్రీలంక నావికాదళం తమ ప్రతాపం చూపించింది.
తమ నౌకతో ఆ పడవను ఢీకొట్టి మరీ.. సముద్రంలో ముంచేశారు. ఇందులోని రాజ్ కిరణ్ గల్లంతయ్యాడు. సుగందన్, సేవియర్‌ను రక్షించి తమ దేశ చెరలో బంధించారు. రాజ్‌కిరణ్ మృతదేహం కోసం శ్రీలంక సేనులు, భారత కోస్టు గార్డు తీవ్రంగానే గాలించింది. ఎట్టకేలకు నెడుం దీవుల్లో ఆ మృతదేహం తేలింది. ఈ మృత దేహానికి శ్రీలంకలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. దీంతో ఉదయాన్నే శ్రీలంకకు చెందిన నౌకలో ఆ మృతదేహాన్ని భారత సరిహద్దుల వరకు తీసుకొచ్చారు. భారత కోస్టుగార్డు వర్గాలకు అప్పగించారు. అక్కడ నుంచి కోటైపట్నంకు తరలించారు.
చదవండి: (సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. కాన్వాయ్ ఆపి మరీ..)
మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో జాలర్లు, అతడి కుటుంబీకులు కన్నీటి సంద్రంలో మునిగారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లను విడిపించే వరకు వేటకు వెళ్లమని జాలర్ల ప్రకటించారు. ఇక, రాజ్‌కిరణ్ మరణ సమాచారంతో దిగ్బ్రాంతిని , సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం ఎంకే స్టాలిన్, అతడి కుటుంబానికి రూ. 10 లక్షలు సాయంప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment