అన్నాడీఎంకే కార్యాలయం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సంస్థాగత ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. వాయిదా వేస్తూ వస్తున్న ఎన్నికలను డిసెంబర్ 31వ తేదీలోగా ముగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. పార్టీ అధినేత్రి జయలలిత 2014లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అది జరగలేదు. 2020లో కరోనా కారణంగా వాయిదా వేశారు. 2021లో కరోనా రెండోదశ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల వల్ల నిర్వహించలేదు. జయలలిత మరణం తర్వాత సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. సంస్థాగత ఎన్నికలను వెంటనే జరపాలని అన్నాడీఎంకే నాయకుడు ఒకరు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు డిసెంబర్ 31వ తేదీలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు పార్టీ అధిష్టానం సమాయత్తమవుతోంది.
చదవండి: (పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఉత్తర్వులు జారీ)
ముల్లైపెరియార్ జలాల వ్యవహారంలో తమిళనాడు హక్కులను కాపాడడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నెల 9న తేని, దిండుగల్లు, మదురై, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో అన్నాడీఎంకే ఆందోళన చేపట్టనుంది. ఈ ఆందోళన ముగియగానే పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కోకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ ప్రధా న కార్యాలయానికి చేరుకుని సంస్థాగత ఎన్నికల తేదీని ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం ప్రధానమైన రెండు పదవులకు కూడా ఎన్నికలు జరపాల్సి ఉంది. మరోవైపు శశికళను పార్టీలోకి తీసుకోవడమా, లేదా అనే చర్చ జరుగుతోంది. పార్టీలో శశికళకు స్థానం లేదని ఎడపాడి, అందరి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం గందరగోళానికి దారితీసింది.
అంతేగాక జోడు పదవులు వద్దని, ఏక నాయకత్వ మే ముద్దు అనే నినాదం కూడా ఎంతోకాలంగా సాగుతోంది. అలాగే పార్టీలో ప్రతి ఒక్క కీలక పదవికీ పోటీ నెలకొనే పరిస్థితి ఉత్పన్నమైంది. పోటీ విషయంలో ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేందుకు వీలులేదని పార్టీ హుకుం జారీచేసింది. శశికళ పునః ప్రవేశంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరని పరిస్థితుల్లో సర్వసభ్య సమావేశం సవాలుగా మారింది. పార్టీ సర్వసభ్య, కార్యవర్గ సమావేశాలు జరపాలంటే సీనియర్ నేతలతో పన్నీర్ సెల్వం, ఎడపాడి ఒకేసారి సమావేశం నిర్వహించి ఒక అభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి ఉంది.
చదవండి: (మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్)
ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం, రెండుసార్లు కార్యవర్గ సమావేశం జరపాలి. కరోనా కారణంగా గత ఏడాది జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ నుంచి గడువు పొందారు. డిసెంబరు 31వ తేదీన జనరల్ బాడీ సమావేశం జరపాలంటే ఈలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సంస్థాగత ఎన్నికలపై ఈ నెల 10వ తేదీన కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment