సాక్షి, చెన్నై : దేనికైనా సిద్ధం అని ప్రకటించిన తలైవా రజనీకాంత్, తాజాగా రాష్ట్రంలో 180 అసెంబ్లీ నియోజకవర్గాల మీద తన గురిని పెట్టినట్టు సంకేతాలువెలువడ్డాయి. ఇక, తలైవా అభిమాన సేన ఆ నియోజకవర్గాల్లో తమ కార్యక్రమాల్ని విస్తృతం చేయడానికి సిద్ధం అయ్యాయి. ఇంటింటా తిరుగుతూ ప్రజా మద్దతు సేకరణకు రెడీ అవుతున్నారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రజనీ కాంత్ పార్టీ కసరత్తులు మీద వేగాన్ని పెంచారు. అయితే, పార్టీ ఎప్పుడు అన్నది మాత్రం ఆయన స్పష్టం చేయడం లేదు. పార్టీ తెర మీదకు వచ్చేలోపు రజనీ మక్కల్ మండ్రం బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. జిల్లాల వారీగా కమిటీలను, అనుభంద విభాగాలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగ వంతంచేశారు. రజనీ రాజకీయ పార్టీని ప్రకటించినానంతరం ఎన్నికలు వస్తే కనీసం 150 స్థానాల్లో ఆయనకు పలుకు బడి పెరిగినట్టే అని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక స్పష్టం చేసింది. దీని గురించి రజనీని కదిలించినప్పుడు నిజంగా జరిగితే సంతోషం అని సమాధానం ఇచ్చారు. అయితే, రజనీ కాంత్ ఆ 150 స్థానాలతో పాటుగా మరోముఫ్పై స్థానాల మీద తన దృష్టిని పెట్టి ఉన్నారు. రాష్ట్రంలో ఆ స్థానాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో మార్పు యోచనలో ఉన్నట్టుగా ఇప్పటికే రహస్య సర్వే ద్వారా సమాచారాన్ని సేకరించి ఉండడం గమనార్హం. అక్కడిప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతుల్ని చేయడం, మార్పు లక్ష్యంగా వారి ద్వారా ఓటు బ్యాంక్‌ను సాధించడం లక్ష్యంగా కొత్త వ్యూహాలకు సిద్ధమై ఉన్నారు.
34 శాతం మేరకు అభిమానులు : రాష్ట్రంలో మొత్తంగా 34 శాతం మేరకు రజనీ అభిమానులు ఉన్నట్టు గుర్తించి ఉన్నారు. వీరిలో ముఫ్పైశాతం మంది రజనీ వెన్నంటి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇక, తాజాగా ఓటర్ల జాబితాలో పదిహేను శాతం మంది కొత్త ఓటర్లు ఉన్నట్టు సమాచారాన్ని సేకరించారు. తన అభిమాన లోకం చేజారకుండా ఉండటంతో పాటుగా కొత్త ఓటర్లను మార్పు నినాదంతో తన వైపునకు తిప్పుకునే రీతిలో కార్యక్రమాలకు తలైవా సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. తన అభిమాన లోకం, కొత్త ఓటర్లలో పది శాతం మంది కలిసి వచ్చినా 40 శాతం గ్యారంటీ అన్న ధీమాతో ఉండటమే కాదు, వారిని రక్షించుకునేందుకు తగ్గట్టుగా ప్రత్యేక కార్యచరణతో అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. యువతను, గ్రామీణ ఓట్లను చీల్చినా 180 స్థానాల్లో గ్యారంటీగా బలాన్ని చాటుకోవచ్చన్న ధీమాతో ఉన్న సూపర్‌స్టార్ రజనీ కాంత్, ముందుగా తన అభిమాన సేనను ఇంటింటా పంపించేందుకు ఆయన సిద్ధం అయ్యారు.
ఇక,అభిమాన లోకం ఇంటింటా తిరుగుతూ, ప్రజల్ని ఆకర్షించడమే కాదు, వారి మదిలో ఉన్న అభిప్రాయాల్ని సేకరించేందుకు ఉరకలు తీయనున్నారు. తద్వారా ముందస్తుగా ప్రజా మనోగతాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ ప్రకటన నిర్ణయం తథ్యమని రజనీ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మక్కల్ మండ్రం వర్గాలు పేర్కొంటున్నారు. ప్రజా మనో గతం తమకు అనుకూలంగా పూర్తిస్థాయిలో ఉన్న పక్షంలో, లోక్‌సభ ఎన్నికల నగారా మోగగానే పార్టీ ప్రకటన తథ్యమని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment