సాక్షి, చెన్నై: తాజాగా మరోసారి రాజకీయాల్లో నానుతున్న పేరు రజనీకాంత్. ఒకప్పుడు దేవుడు శాసిస్తే ఈ రజనీకాంత్ పాటిస్తాడు అంటూ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన రెండు దశాబ్దాలపాటూ అభిమానుల్లో ఆశలు రేకెత్తించారు. తర్వాత తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదంటూ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఆరోగ్యం సహకరించకపోవడం కారణంగానే రాజకీయాల్లోకి రావడం లేదని రజనీ వివరణ ఇచ్చారు. అక్కడితో ఈయన రాజకీయ కథ ముగిసిందని అందరూ అనుకున్నారు.
అయితే, రజనీ రాజకీయ జీవితంపై మరోసారి విస్తృతంగా చర్చ సాగుతోంది. గతంలో రజనీకాంత్‌ను తమ పార్టీలోకి చేర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన బీజేపీ అగ్రనేతలు మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తలైవాకు గవర్నర్ పదవిని ఎర వేస్తున్నట్లు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీ ఇటీవల హడావుడిగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఆ వెంటనే అనూహ్యంగా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవితే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌తో తాను రాజకీయాలు చర్చించిన విషయం నిజమేనని, అయితే వాటి గురించి చెప్పనని నిక్కచ్చిగా తెలిపారు. ఇకపోతే రజనీకాంత్ గురించి గత కొద్దికాలంగా ఢిల్లీ బీజేపీ ప్రముఖ నేతలలో పెద్ద చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
తమిళనాడులో ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలంటే.. రజనీకాంత్‌ను వాడుకోవాలని, ఆయన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి కాబట్టి హిందూమత తత్వంతో ప్రజల్లోకి వెళ్లేలా చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య జరిగిన నీతి ఆయోగ్ సమావేశాలకు రజనీని ఆహ్వానించడం కూడా ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని గవర్నర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక చిన్న రాష్ట్రానికి రజనీకాంత్‌ను గవర్నర్‌గా నియమిస్తే తాము అనుకున్నది సాధించవచ్చుననే భావనతో వారు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రజనీకాంత్‌పై సానుకూలంగా ఉంటే అమిత్‌షా వ్యతిరేకిస్తున్నట్లు టాక్. కాగా తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోగా ఏదైనా జరగవచ్చు. తలైవాకు గవర్నర్ అయ్యే యోగం ఉందా? దేవుడు శాసిస్తాడా? రజనీ పాటిస్తాడా? ఈ ప్రశ్నలకు బదులు కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం రజనీకాంత్ తన 169వ చిత్రం జైలర్ చిత్ర పనులలో బిజీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment