
ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశంతో తమిళిసై తన పదవికి రాజీనామా చేసి ఉంటారని..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాజ్‌భవన్ అధికారిక ప్రకటన ప్రకారం.. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనంతరం, రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆమె చెన్నైకి వెళ్తారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజకీయపరంగా తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉంది. అయితే తర్వాతి కాలంలో బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపించారు.