రాజకీయ పార్టీ కసరత్తుల్లో ఉన్న రజనీకాంత్ తనకంటూ ఓ చానల్‌కు సిద్ధం అయ్యారు. సామాజిక మాధ్యమాలకు ప్రస్తుతం క్రేజ్ పెరిగిన దృష్ట్యా, తన చానల్‌ను యూట్యూబ్ చానల్‌గా తీసుకొచ్చే పనిలో పడ్డారు. మక్కల్ మండ్రం వ్యవహారాలన్నీ అందులోకి అప్‌లోడ్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు.
సాక్షి,చెన్నై : తాను రాజకీయాల్లోకి వచ్చేశా అని దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించి నాలుగు నెలలు అవుతోంది. ప్రత్యేక పార్టీతో ప్రజల్లోకి అని ప్రకటించి, అందుకు తగ్గ కసరత్తుల్లో తలైవా నిమగ్నమై ఉన్నారు. పార్టీ కన్నా ముందుగా, తన అభిమాన సంఘాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. రజనీ మక్కల్ మండ్రం పేరుతో అభిమాన సంఘాల్ని ఏకంచేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాలకు మక్కల్ మండ్రం కార్యవర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. సభ్యత్వ నమోదు జోరుగానే సాగుతోంది. తరచూ మీడియా ముందుకు వచ్చి స్పందిస్తూ వస్తున్న రజనీకాంత్, ఇక, తన సందేశాలు, పిలుపులన్నీ యూట్యూబ్ ద్వారా అభిమానులకు చేరవేయడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు.
రజనీ యూట్యూబ్ చానల్
రజనీకాంత్ ఇప్పటికే మక్కల్ మండ్రం పేరిట ఓ వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మండ్రం నిర్వాహకులకు, సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఆ వెబ్‌సైట్ ద్వారా అప్పుడప్పుడూసందేశాల్ని ఇస్తున్నారు. అయితే, రాజకీయంగా పార్టీతో తెరమీదకు రానున్న రజనీకి మరింత ప్రచారం తప్పనిసరిగా మారింది. దీంతో సామాజిక మాధ్యమాల మీద రజనీ దృష్టి పెట్టారు. దీనికి ప్రస్తుతం క్రేజ్ మరీ ఎక్కువగా ఉండడంతో రజనీ మక్కల్ మండ్రం పేరిట యూ ట్యూబ్ చానల్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇందులో ఎప్పటికప్పుడు రజనీకాంత్ సందేశాలు, పిలుపులు, కార్యక్రమాలు, అన్ని రకాల వివరాలను తెలియజేయనున్నారు. అలాగే, రజనీ మక్కల్ మండ్రం ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలను ఇందులోకి అప్‌లోడ్ చేసే పనిలో పడ్డారు.
ఈ చానల్‌ను తెరమీదకు తెస్తూ లాంఛనంగా ఆదివారం జరిగిన రజనీకాంత్ ప్రెస్ మీట్‌ను పదేపదే ప్రసారం చేస్తుండడం గమనించ దగ్గ విషయం. ఇదిలా ఉండగా, కేంద్రంపై దుమ్మెత్తి పోస్తూ ఆదివారం రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్‌ను సూపర్ స్టార్ చేసింది తమిళులు అన్న విషయాన్ని ఆయన మరవకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. అయితే, కేంద్రాన్ని హెచ్చరించే రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక, కేంద్రం తీరుపై నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై సైతం ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment