మహిళా నేతలతో కలసి మీడియాతో మాట్లాడుతున్న రజనీ కాంత్
‘‘మహిళా శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తథ్యం. నారీమణులకు ఎక్కడ ప్రాధాన్యత ఉంటుందో అక్కడలా ప్రగతి ,అభివృద్ధి రెట్టింపు అవుతుంది. అందుకేమా పార్టీలో మహిళలకు కీలకంగాప్రాధాన్యతను కల్పించబోతున్నాం’’ అనిదక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్‌రజనీ కాంత్ వ్యాఖ్యానించారు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్ణయాన్ని ప్రకటించి తీరుతానని స్పష్టం చేశారు. ఆదివారం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ఆయన మహిళా విభాగం నేతలతో భేటీ అయ్యారు.
సాక్షి, చెన్నై : మక్కల్ మండ్రం బలోపేతం తదుపరి పార్టీ ప్రకటనకు తగ్గ కార్యాచరణతో రజనీ కాంత్ ముందుకు సాగుతున్నారు. అమెరికా పర్యటన తదుపరి ఆయన పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రజనీ మక్కల్ మండ్రం వర్గాలతో, యువజన విభాగంతో భేటీలు ముగించారు. తాజాగా, మహిళా విభాగంతో సమావేశమయ్యారు. తదుపరి మక్కల్ మండ్రం నిర్వాహకులందరినీ ఒక చోట చేర్చి కీలక ప్రకటనకు సన్నద్ధం అవుతున్నారు.
మహిళా విభాగంతో సమాలోచన
రాజకీయ పయనంలో భాగంగా మహిళా విభాగంతో పోయెస్ గార్డెన్ వేదికగా రజనీ కాంత్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో మక్కల్ మండ్రంలో నిర్వాహులుగా ఉన్న మహిళా నేతలకు ఉన్న రాజకీయ అవగాహన, సమస్యలపై వారి స్పందన, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, స్థానికంగా ప్రజలతో మమేకం అయ్యే రీతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై రజనీకాంత్ చర్చించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లోని సమస్యలు, మక్కల్ మండ్రంలో సభ్యత్వం, ప్రగతి, బలోపేతం గురించి వివరించారు. ఆయా పార్టీల్లోని మహిళా నేతలకు దీటుగా తాము సైతం దూసుకెళ్లగలమని ధీమా వ్యక్తంచేస్తూ రజనీ కాంత్‌కు మహిళా లోకం హామీ ఇచ్చింది. ఈ భేటీ అనంతరంమహిళా నేతలతో రజనీ కాంత్ ఫొటోలు దిగారు. అనంతరం వారితో కలసి మీడియా ముందుకు వచ్చారు.
మహిళలకు పెద్ద పీట
మక్కల్ మండ్రంకు మహిళా శక్తి ఆదరణ మెండుగా ఉందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తంచేశారు. నారీమణులు అత్యధికంగా ఎక్కడ ఉంటారో అక్కడ విజయం త«థ్యమన్నారు. మహిళా శక్తి ఇస్తున్న ఉత్సాహం, ప్రోత్సాహం, చూపుతున్న అభిమానం, భరోసా చూస్తుంటే, ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత కల్పిస్తారో అక్కడ ప్రగతి, అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. అందుకే మక్కల్‌మండ్రంలోను, తాను ప్రకటించబోయే పార్టీలోను మహిళలకు కీలక ప్రాధాన్యత, బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించారు. వారి సేవల్ని ఉపయోగించుకుంటామన్నారు.
ప్రజా స్వామ్య విజయం
కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని రజనీ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర గవర్నర్ తీరును తప్పుబడుతూ, సుప్రీంకోర్టు సకాలంలో స్పందించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా, బల పరీక్షకు పదిహేను రోజుల అవకాశాన్ని గవర్నర్ కల్పించడం శోచనీయమని విమర్శించారు. అయితే, కోర్టు జోక్యం తదుపరి చోటుచేసుకున్న పరిణామాలతో సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు కుమారస్వామి సిద్ధం అవుతుండడం ప్రజా స్వామ్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. కావేరి వ్యవహారంలో కమిషన్ అన్నది ఏమేరకు ఫలితాల్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కర్ణాటకలోని జలాశయాల్ని ఆ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కమిషన్‌లో రాజకీయ జోక్యం ఉండేందుకు ఆస్కారం ఉందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..? అని ప్రశ్నించగా, అలాగే అనుకోండి అని సమాధానం ఇచ్చారు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ఎన్నికల తేదీలు ఎప్పడు ప్రకటించినా, ఆ సమయంలో కీలక నిర్ణయంతో ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబరు 31వ తేదీనే తాను స్పష్టంచేశానని, ఎన్నికల గంట ఎప్పుడు మోగినా, రెడీ అని ప్రకటించారు. అన్ని సిద్ధం చేసుకునే ఉన్నామని, ఎలాంటి ఎన్నికలకైనా ఎదుర్కొంటామని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment