Womens Section
-
‘పిస్టల్’ పని చేయలేదు!
టోక్యో: తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యువ షూటర్ మనూ భాకర్ గుండె పగిలింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కచ్చితంగా పతకం సాధించగలదని భావించిన భాకర్, ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. తాను నమ్ముకున్న ‘ఆయుధం’ ఆమెను చివరకు దెబ్బ తీసింది. క్వాలిఫయింగ్ ఈవెంట్ సందర్భంగా భాకర్ పిస్టల్ సాంకేతిక లోపంతో పని చేయలేదు. పోటీ జరుగుతున్న వేదిక నుంచి కాస్త దూరంగా వెళ్లిన భారత షూటర్... దానిని సరి చేయించుకొని వచ్చి మళ్లీ బరిలోకి దిగే సరికే అమూల్యమైన సమయం వృథా అయింది. దాంతో 19 ఏళ్ల మనూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొత్తం 6 రౌండ్లలో వరుసగా 98, 95, 94, 95, 98, 95 (మొత్తం కలిపి 575 పాయింట్లు) స్కోర్ చేసిన ఆమె 12వ స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలు చేజార్చుకుంది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారత షూటర్ యశస్విని సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు సాధించిన ఆమె 13వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారే ఫైనల్‌కు చేరుకుంటారు. రెండో పిస్టల్ ఉన్నా కూడా... సాధారణంగా షూటర్లు ఈవెంట్ సమయంలో ‘స్పేర్ గన్’ను ఉంచుకుంటారు. పేరుకు ఇది కూడా గ్రిప్, ట్రిగ్గర్ తదితర అంశాల్లో దాదాపుగా మొదటి పిస్టల్‌లాగే ఉన్నా... సుదీర్ఘ కాలంగా మొదటి గన్‌తోనే ప్రాక్టీస్ చేసిన అలవాటు వల్ల కొత్త గన్ను అంత సమర్థంగా ఉపయోగించడం కష్టమవుతుంది. పైగా రెండో గన్ తీసుకుంటే ఎలా పని చేస్తుందో చూసేందుకు ‘సైటర్స్’ (షూట్ చేసి పరీక్షించడం) చేయాల్సి ఉంటుంది. మొత్తం పిస్టల్ చెడిపోవడంవంటి అత్యవసర పరిస్థితి అయితే తప్ప రెండో గన్ను బయటకు తీయరు. భాకర్ ఘటనతో కొత్త గన్ను పరీక్షించడంతో పోలిస్తే మొదటి గన్ను రిపేర్ చేయడానికే తక్కువ సమయం పడుతుంది కాబట్టి దానినే ఎంచుకున్నట్లు రోనక్ పండిట్ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మనూ మంచి స్కోరు సాధించగలిగింది. ఇలాంటి స్థితిలోనూ ఆమె కుప్పకూలిపోలేదు. గన్లకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కానీ అసలు లివర్ విరిగిపోవడం అనేది అనూహ్యం. మనూ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా’ అని పండిట్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మరో రెండు ఈవెంట్లు (25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్)లలో భాకర్ ఇంకా పోటీ పడాల్సి ఉంది. అసలేం జరిగింది? వేర్వేరు ప్రపంచకప్‌లలో 9 స్వర్ణాలు, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలతో పాటు ప్రస్తుత వరల్డ్ నంబర్ 2 అయిన హరియాణా టీనేజర్ మనూ భాకర్‌పై ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మనూ కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్కోరు సాధించే మొత్తం 60 షాట్లు అందుబాటులో ఉంటాయి. ఆరు సిరీస్‌లలో కలిపి 75 నిమిషాల్లో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 షాట్లు ఆడిన తర్వాత ఆమె పిస్టల్ మొరాయించింది. ఈ 16 షాట్లను అద్భుతంగా వాడుకున్న భాకర్ స్కోరులో 10 పాయింట్ల షాట్లు 10... 9 పాయింట్ల షాట్లు 6 ఉండటం విశేషం. అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె సరైన దిశలోనే సాగింది. ‘పిస్టల్ కాకింగ్ లివర్ విరిగిపోయింది. ఇలాంటిది సాధారణంగా ఎప్పుడూ జరగదు. లివర్ మార్చాలంటే గ్రిప్, ట్రిగ్గర్ సర్క్యూట్ కూడా బయటకు తీయాల్సి ఉంటుంది. దీనిని సరి చేసిన తర్వాత సర్క్యూట్ పని చేయలేదు. దాంతో దానిని కూడా మార్చాల్సి వచ్చింది’ అని మనూ భాకర్ కోచ్ రోనక్ పండిట్ వివరించారు. నిబంధనల ప్రకారం షూటర్ల వ్యక్తిగత సమస్యకు ఎలాంటి అదనపు సమయం లభించదు. మనూ మళ్లీ తన స్పాట్ వద్దకు వచ్చి షూట్ చేసే సమయానికి మరో 38 నిమిషాలు మిగిలి ఉండగా, 44 షాట్లు పూర్తి చేయాల్సి ఉంది. దాంతో వేగం పెంచిన మనూ తన సామర్థ్యానికి తగినట్లుగా చివర్లో షూట్ చేయలేక 2 పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయింది. ముఖ్యంగా 60వ షాట్లో 10 పాయింట్లు స్కోర్ చేసి ఉంటే ముందంజ వేసే అవకాశం ఉండగా... 8 పాయింట్లు మాత్రమే సాధించింది. దీపక్, దివ్యాంశ్ విఫలం... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. బరిలోకి దిగిన ఇద్దరు షూటర్లు దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో దీపక్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలవగా... 622.8 పాయింట్లు సాధించిన దివ్యాంశ్ సింగ్ పన్వర్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నారు. స్కీట్‌లో అవకాశం ఉందా! పురుషుల స్కీట్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు తొలి రోజు ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చారు. ఇదే పోటీ సోమవారం కూడా కొనసాగుతుంది. మొదటి రోజు అంగద్ సింగ్ అందుబాటులో ఉన్న 75 పాయింట్లలో 73 పాయింట్లు (24, 25, 24) సాధించి 11వ స్థానంలో ఉన్నాడు. మిగిలిన రెండు సిరీస్‌లలో నేడు పోరాడతాడు. మరో భారత షూటర్ మేరాజ్ 71 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచాడు. మొత్తం ఐదు సిరీస్‌లు ముగిసిన అనంతరం టాప్–6 మాత్రమే ఫైనల్లోకి అడుగుపెడతారు. -
మగువ 'ధీర'
‘‘మహిళా శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తథ్యం. నారీమణులకు ఎక్కడ ప్రాధాన్యత ఉంటుందో అక్కడలా ప్రగతి ,అభివృద్ధి రెట్టింపు అవుతుంది. అందుకేమా పార్టీలో మహిళలకు కీలకంగాప్రాధాన్యతను కల్పించబోతున్నాం’’ అనిదక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్రజనీ కాంత్ వ్యాఖ్యానించారు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్ణయాన్ని ప్రకటించి తీరుతానని స్పష్టం చేశారు. ఆదివారం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ఆయన మహిళా విభాగం నేతలతో భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై : మక్కల్ మండ్రం బలోపేతం తదుపరి పార్టీ ప్రకటనకు తగ్గ కార్యాచరణతో రజనీ కాంత్ ముందుకు సాగుతున్నారు. అమెరికా పర్యటన తదుపరి ఆయన పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రజనీ మక్కల్ మండ్రం వర్గాలతో, యువజన విభాగంతో భేటీలు ముగించారు. తాజాగా, మహిళా విభాగంతో సమావేశమయ్యారు. తదుపరి మక్కల్ మండ్రం నిర్వాహకులందరినీ ఒక చోట చేర్చి కీలక ప్రకటనకు సన్నద్ధం అవుతున్నారు. మహిళా విభాగంతో సమాలోచన రాజకీయ పయనంలో భాగంగా మహిళా విభాగంతో పోయెస్ గార్డెన్ వేదికగా రజనీ కాంత్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో మక్కల్ మండ్రంలో నిర్వాహులుగా ఉన్న మహిళా నేతలకు ఉన్న రాజకీయ అవగాహన, సమస్యలపై వారి స్పందన, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, స్థానికంగా ప్రజలతో మమేకం అయ్యే రీతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై రజనీకాంత్ చర్చించారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లోని సమస్యలు, మక్కల్ మండ్రంలో సభ్యత్వం, ప్రగతి, బలోపేతం గురించి వివరించారు. ఆయా పార్టీల్లోని మహిళా నేతలకు దీటుగా తాము సైతం దూసుకెళ్లగలమని ధీమా వ్యక్తంచేస్తూ రజనీ కాంత్‌కు మహిళా లోకం హామీ ఇచ్చింది. ఈ భేటీ అనంతరంమహిళా నేతలతో రజనీ కాంత్ ఫొటోలు దిగారు. అనంతరం వారితో కలసి మీడియా ముందుకు వచ్చారు. మహిళలకు పెద్ద పీట మక్కల్ మండ్రంకు మహిళా శక్తి ఆదరణ మెండుగా ఉందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తంచేశారు. నారీమణులు అత్యధికంగా ఎక్కడ ఉంటారో అక్కడ విజయం త«థ్యమన్నారు. మహిళా శక్తి ఇస్తున్న ఉత్సాహం, ప్రోత్సాహం, చూపుతున్న అభిమానం, భరోసా చూస్తుంటే, ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత కల్పిస్తారో అక్కడ ప్రగతి, అభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. అందుకే మక్కల్మండ్రంలోను, తాను ప్రకటించబోయే పార్టీలోను మహిళలకు కీలక ప్రాధాన్యత, బాధ్యతలు అప్పగిస్తామని ప్రకటించారు. వారి సేవల్ని ఉపయోగించుకుంటామన్నారు. ప్రజా స్వామ్య విజయం కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని రజనీ వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్ర గవర్నర్ తీరును తప్పుబడుతూ, సుప్రీంకోర్టు సకాలంలో స్పందించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా, బల పరీక్షకు పదిహేను రోజుల అవకాశాన్ని గవర్నర్ కల్పించడం శోచనీయమని విమర్శించారు. అయితే, కోర్టు జోక్యం తదుపరి చోటుచేసుకున్న పరిణామాలతో సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు కుమారస్వామి సిద్ధం అవుతుండడం ప్రజా స్వామ్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. కావేరి వ్యవహారంలో కమిషన్ అన్నది ఏమేరకు ఫలితాల్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కర్ణాటకలోని జలాశయాల్ని ఆ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కమిషన్‌లో రాజకీయ జోక్యం ఉండేందుకు ఆస్కారం ఉందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..? అని ప్రశ్నించగా, అలాగే అనుకోండి అని సమాధానం ఇచ్చారు. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని, ఎన్నికల తేదీలు ఎప్పడు ప్రకటించినా, ఆ సమయంలో కీలక నిర్ణయంతో ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబరు 31వ తేదీనే తాను స్పష్టంచేశానని, ఎన్నికల గంట ఎప్పుడు మోగినా, రెడీ అని ప్రకటించారు. అన్ని సిద్ధం చేసుకునే ఉన్నామని, ఎలాంటి ఎన్నికలకైనా ఎదుర్కొంటామని ముగించారు. -
మహిళలకేదీ ప్రాధాన్యం?
► మహిళా సాధికారతను విస్మరించిన కేసీఆర్ సర్కారు ►ఎన్నికల హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం ► వైఎస్సార్ పథకాలకు పేరు మారిస్తే ప్రజలు మర్చిపోతారా..? ► మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.అమృతసాగర్ కరీంనగర్ సిటీ: సీఎం కేసీఆర్ సర్కారులో మహిళలకు ప్రాధాన్యం లేదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కె.అమృతసాగర్ విమర్శించారు. మహిళా సాధికారత అంటే కేసీఆర్ కూతురు కవిత మాత్రమేనా అని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆరుగురు మహిళా మంత్రులకు చోటు కల్పించడమే కాకుండా.. దేశంలోనే మొదటిసారిగా ఓ మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా పక్షపాతిగా మహిళల పేరిట ఇందిరమ్మ ఇళ్లు, మహిళలను లక్షాధికారులను చేయాలనే ధ్యేయంతో పావలావడ్డీ రుణాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. తెలంగాణలో ఏదో జరుగుతుందని ఆశపడి టీఆర్ఎస్కు పట్టం కడితే ఈ రెండున్నరేళ్ల కాలంలో ఒరిగిందేమీ లేదన్నారు. బడుగుల కోసం వైఎస్సార్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టి విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తే... నేడు కేసీఆర్ సర్కారు విద్యార్థులను రోడ్లపైకి ఈడ్చిందని, అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి పథకం ఆచరణలో విఫలమరుు్యందని, పెండ్లి పత్రికలు, దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరగడానికే పరిమితమరుు్యందని అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చినా లబ్ధి చేకూర్చడం లేదన్నారు. పేరు మారిస్తే వైఎస్సార్‌ను మర్చిపోరని, ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా వైఎస్సార్సీపీ ఎదుగుతుందని, అందుకు ప్రతి కార్యకర్తలు ఐక్యతతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బంగారంపై ఆంక్షలు అర్థరహితం బంగారంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం అర్థరహితమని అమృతసాగర్ అన్నారు. భారతీయ మహిళలు అత్యంత ఇష్టపడే బంగారంపై పరిమితులు విధించడం తగదన్నారు. మహిళలకు తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఎన్నోసార్లు బంగారాన్ని కానుకలుగా ఇస్తారన్నారు. బంగారంపై ఆంక్షలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేస్తామని అన్నారు. వైఎస్సార్ పాలన స్వర్ణయుగం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ మాట్లాడుతూ వైఎస్సార్ పాలన స్వర్ణయుగమని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో కేసీఆర్ డబుల్బెడ్రూం, దళితులకు మూడెకరాల భూపంపిణీ వంటి ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు గ్రామాలను మినహా మరెక్కడా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు పునాదులు పడలేదన్నారు. సీఎం మాత్రం రూ.40 కోట్ల ప్రజాధనంతో రాజభవనం నిర్మించుకున్నారని విమర్శించారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్న టీఆర్ఎస్ సర్కారు విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలను కోరారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాల బోగె పద్మ మాట్లాడుతూ ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ మహిళలకు ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసమే వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై మహిళలను చైతన్యవంతం చేస్తామన్నారు. ఇందిరమ్మ బిల్లుల కోసం ధర్నా జిల్లాలో వివిధ దశల్లో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మీర్ నేహ, సంయుక్త కార్యదర్శి రాగ సంధ్య, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కీసర సాగర్, వరాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, జిల్లా యూత్ ప్రెసిడెంట్ బండి వెంకట రమణారెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీద అంజయ్య, నగర అధ్యక్షుడు సాన రాజన్న, తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రేషవేణి వేణుయాదవ్, రాష్ట్ర యూత్ సెక్రటరీ దుబ్బాక సంపత్, నాయకులు సాదిక్ బలాలా, ఎస్కే.జావీద్, వరాల అనిల్, కట్టెకోల యాదగిరి, ఎండీ.రహీం పాల్గొన్నారు. -
కబడ్డీ ‘క్వీన్స్’
ప్రొ కబడ్డీ మహిళల విజేత స్ట్రామ్ క్వీన్స్ ఫైనల్లో ఫైర్‌బర్డ్స్‌పై సంచలన విజయం చివరి సెకన్లలో డ్రామా హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ మహిళల విభాగంలో విజయ ‘తుఫాను’ రేగింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో స్ట్రామ్ క్వీన్స్ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో క్వీన్స్ 24-23 పాయింట్ల తేడాతో ఫైర్ బర్డ్స్‌పై విజయం సాధించింది. చివరి సెకను వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడినా... ఆఖరి క్షణంలో తేజస్వినీ బాయి అద్భుత రైడింగ్‌తో రెండు పాయింట్లు సాధించి క్వీన్స్‌ను గెలిపించింది. స్ట్రామ్ జట్టు తరఫున సాక్షి కుమారి ఆరు రైడింగ్ పాయింట్లు సహా మొత్తం ఎనిమిది పాయింట్లు స్కోర్ చేసింది. బర్డ్స్ మహిళలలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కె.రింజు ఏడు పాయింట్లతో ఆకట్టుకుంది. ఫైర్ కెప్టెన్ మమతా పుజారి పూర్తిగా విఫలం కావడం ఆ జట్టును దెబ్బ తీసింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 10-8తో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన బర్డ్స్ చివరకు మ్యాచ్ కోల్పోయింది. సెకన్ల వ్యవధిలో....: మహిళల ఫైనల్లో చివరి నిమిషంలో డ్రామా చోటు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో పాయిట్ కోసం పోరాడుతూ చివరి వరకు సమంగా నిలుస్తూ వచ్చాయి. 29వ నిమిషం ముగిసేసరికి 22-17తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న ఉన్న క్వీన్స్ విజయానికి చేరువైంది. అయితే 30వ నిమిషంలో బర్డ్ రైడర్ రింజు 3 పాయింట్లు కొల్లగొట్టింది. అయితే ఈ దశలోనూ క్వీన్స్ 22-20తో ముందంజలో ఉంది. ఆ వెంటనే బర్డ్స్ కెప్టెన్ మమతా పూజారి తర్వాతి రైడింగ్‌లో మరో 3 పాయింట్లు రాబట్టడంతో జట్టు 23-22తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వెళ్లింది. గెలుపు ఖాయమైందని భావించిన అమ్మాయిలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ మరో రెండు సెకన్లలో మ్యాచ్ ముగిసే సమయంలో స్ట్రామ్ కెప్టెన్ తేజస్వినీ బాయి ప్రత్యర్థి కోర్టులోకి దూసుకుపోయింది. బర్డ్స్ కోలుకునే లోపే రెండు పాయింట్లు స్కోర్ చేసి తమ జట్టును విజేతగా నిలిపింది. క్వీన్స్ ఆనందంతో గంతులు వేయగా, బర్డ్స్ మహిళలు నిరాశలో మునిగారు. -
ప్రత్యూషకు ఐదో విజయం
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్‌కే చెందిన సౌమ్యతో ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ప్రత్యూష 53 ఎత్తుల్లో గెలుపొందింది. ప్రస్తుతం ప్రత్యూష ఆరు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఓపెన్ విభాగంలోని ఎనిమిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హారిక 48 ఎత్తుల్లో జాంగ్ జోంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... డక్హవో ఎన్గుయెన్ (వియత్నాం)తో జరిగిన గేమ్‌ను కోనేరు హంపి 48 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
ప్రపంచ నంబర్‌వన్‌గా సైనా నెహ్వాల్
అంతర్జాతీయ స్థాయిలో అరుదైన టైటిల్స్‌తో పాటు... అమోఘమైన ఆటతీరుతో చైనా డ్రాగన్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. మహిళల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించడంతో పాటు మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ భారత్‌కు నంబర్‌వన్ కలను తీర్చింది. న్యూఢిల్లీ: హైదరాబాద్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ ర్యాంక్‌ను గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే (1980) తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నది సైనానే కావడం విశేషం. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన 25 ఏళ్ల సైనా అంతర్జాతీయ స్థాయిలో 14 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా కూడా రికార్డు సృష్టించింది. సైనాకు అభినందనల వెల్లువ సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుకు చేరిన క్రీడాకారిణిగా నిలిచిన సైనా నెహ్వాల్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆటనే వదిలేద్దామనుకున్నా! ఈ స్థాయికి రావడానికి నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒక దశలో ప్రతీ టాప్ క్రీడాకారిణి చేతిలో వరుసగా ఓడుతూ వచ్చాను. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అయితే బ్యాడ్మింటన్‌నే వదిలేద్దామనుకున్నా. నా కెరీర్లో అదో బాధాకరమైన సమయం. అప్పట్లో నీ కెరీర్ అయిపోయిందని చాలా మంది నాతో అన్నారు. బెంగళూరు వెళ్లాక కోచ్ విమల్ మే లోగా నంబర్‌వన్ కావాలని లక్ష్యంగా పెట్టారు. నేను మార్చిలోనే దానిని సాధించా. నంబర్‌వన్‌తో చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా నమ్మలేకపోతున్నాను. అధికారికంగా ర్యాంకుల జాబితా చూసిన తర్వాతే నమ్మగలనేమో! ప్రతీ ప్లేయర్ కలలు గనే ఘనత ఇది. నా ప్రదర్శనతోనే ఇదంతా సాధ్యమైంది. ఏడాదిన్నరగా లీ జురి ఆ స్థానంలో ఉంది. ఐదేళ్ల క్రితమే రెండో ర్యాంక్‌కు చేరుకున్నాను. ఇప్పుడు మా అమ్మ కోరిక నంబర్‌వన్‌ను ఇప్పటికి నెరవేర్చగలిగా. ఒలింపిక్ పతకం తర్వాత నా దృష్టిలో తర్వాతి స్థానం ఈ నంబర్‌వన్ ర్యాంక్దే’ - సైనా నెహ్వాల్ -
'కొందరు మగవాళ్లు మాట వినడంలేదు'
మహిళల భద్రత దృష్ట్యా సిటీ బస్సుల్లో 'స్లైడింగ్ డోరు సిస్టమ్' ఏర్పాటును పలువురు పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన స్లైడింగ్ వ్యవస్థ అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు సిటీ బస్సులలో మహిళల, పురుషుల సీట్లకు మధ్య స్లైడింగ్ డోర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మగవాళ్లు మాత్రం ... ఆర్డినరీ సిటీ బస్సు ముందు డోర్ల నుంచి ఎక్కడం...మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చోవటం తమ జన్మహక్కుగా వ్యవహరిస్తున్నారట. ఈ కొత్త సిస్టమ్‌ను అనుసరించడం లేదు. స్త్రీలకు మేం దూరంగా ఉండలేము అన్నట్లుగా ఉంది పురుషుల వ్యవహారం. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే... మధ్యవయస్సు వారితో ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయనేది కండక్టర్లు, డ్రైవర్ల వాదన. 'బస్సు ముందు డోరు భాగం అనేది స్త్రీలు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా మగవాళ్లు వినిపించుకోవడం లేదు' అని ఓ సిటీ బస్సు డ్రైవర్ అన్నారు. 'పురుషులకు కేటాయించిన సెక్షన్‌కు వెళ్లాలని ఎంత చెప్పినా మగవారు అర్థం చేసుకోవడం లేదు. మధ్య వయస్సు ఉన్న వారితోనే అసలు సమస్య వస్తుంది. ఆరోగ్యం బాగాలేదని కూర్చోవడానికి అనుమతించాలని మహిళల విభాగంలోనే ఉంటున్నారు. పెనాల్టీ లాంటిది ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండదు' అని ఓ మహిళా కండక్టర్ తెలిపారు. ఇక సిటీ బస్సుల్లో తమ కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఊపిరి పీల్చుకుంటుంటే... మగవారు మాత్రం స్లైడింగ్ డోరు వ్యవస్థను జీర్ణించుకోలేకపోతున్నారు. -
నర్సింగ్కు కాంస్యం మిస్
బుడాపెస్ట్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. బుధవారం జరిగిన పురుషుల 74 కేజీల రెప్‌చేజ్ రౌండ్లో నర్సింగ్ 1-6తో అలీ షబానో (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో 10-2తో కకబెర్ కుబ్జెటి (రష్యా)పై నెగ్గిన నర్సింగ్... రెండో రౌండ్లో 0-7తో జోర్గాన్ బురోగస్ (అమెరికా) చేతిలో ఓడాడు. అయితే జోర్డాన్ ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు రెప్‌చేజ్ అవకాశం దక్కింది. మరోవైపు మహిళల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. 51 కేజీల విభాగం రెండో రౌండ్లో వినేశ్ 3-6తో ఇసబెల్లా సంబు (సెనెగల్) చేతిలో పరాజయం చవిచూసింది. 48 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో నిర్మలా దేవి 0-7తో అలైసా లాంపీ (అమెరికా) చేతిలో ఓడింది.