ప్రపంచ నంబర్‌వన్‌గా సైనా నెహ్వాల్
అంతర్జాతీయ స్థాయిలో అరుదైన టైటిల్స్‌తో పాటు... అమోఘమైన ఆటతీరుతో చైనా డ్రాగన్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. మహిళల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించడంతో పాటు మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ భారత్‌కు నంబర్‌వన్ కలను తీర్చింది.
న్యూఢిల్లీ: హైదరాబాద్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ ర్యాంక్‌ను గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే (1980) తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నది సైనానే కావడం విశేషం. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన 25 ఏళ్ల సైనా అంతర్జాతీయ స్థాయిలో 14 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా కూడా రికార్డు సృష్టించింది.
సైనాకు అభినందనల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుకు చేరిన క్రీడాకారిణిగా నిలిచిన సైనా నెహ్వాల్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఆటనే వదిలేద్దామనుకున్నా!
ఈ స్థాయికి రావడానికి నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒక దశలో ప్రతీ టాప్ క్రీడాకారిణి చేతిలో వరుసగా ఓడుతూ వచ్చాను. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అయితే బ్యాడ్మింటన్‌నే వదిలేద్దామనుకున్నా. నా కెరీర్‌లో అదో బాధాకరమైన సమయం. అప్పట్లో నీ కెరీర్ అయిపోయిందని చాలా మంది నాతో అన్నారు. బెంగళూరు వెళ్లాక కోచ్ విమల్ మే లోగా నంబర్‌వన్ కావాలని లక్ష్యంగా పెట్టారు. నేను మార్చిలోనే దానిని సాధించా.
నంబర్‌వన్‌తో చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా నమ్మలేకపోతున్నాను. అధికారికంగా ర్యాంకుల జాబితా చూసిన తర్వాతే నమ్మగలనేమో! ప్రతీ ప్లేయర్ కలలు గనే ఘనత ఇది. నా ప్రదర్శనతోనే ఇదంతా సాధ్యమైంది. ఏడాదిన్నరగా లీ జురి ఆ స్థానంలో ఉంది. ఐదేళ్ల క్రితమే రెండో ర్యాంక్‌కు చేరుకున్నాను. ఇప్పుడు మా అమ్మ కోరిక నంబర్‌వన్‌ను ఇప్పటికి నెరవేర్చగలిగా. ఒలింపిక్ పతకం తర్వాత నా దృష్టిలో తర్వాతి స్థానం ఈ నంబర్‌వన్ ర్యాంక్‌దే’
- సైనా నెహ్వాల్