'కొందరు మగవాళ్లు మాట వినడంలేదు'
మహిళల భద్రత దృష్ట్యా సిటీ బస్సుల్లో 'స్లైడింగ్ డోరు సిస్టమ్' ఏర్పాటును పలువురు పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన స్లైడింగ్ వ్యవస్థ అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు సిటీ బస్సులలో మహిళల, పురుషుల సీట్లకు మధ్య స్లైడింగ్ డోర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే కొందరు మగవాళ్లు మాత్రం ... ఆర్డినరీ సిటీ బస్సు ముందు డోర్ల నుంచి ఎక్కడం...మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చోవటం తమ జన్మహక్కుగా వ్యవహరిస్తున్నారట. ఈ కొత్త సిస్టమ్ను అనుసరించడం లేదు. స్త్రీలకు మేం దూరంగా ఉండలేము అన్నట్లుగా ఉంది పురుషుల వ్యవహారం. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే... మధ్యవయస్సు వారితో ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయనేది కండక్టర్లు, డ్రైవర్ల వాదన.
'బస్సు ముందు డోరు భాగం అనేది స్త్రీలు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా మగవాళ్లు వినిపించుకోవడం లేదు' అని ఓ సిటీ బస్సు డ్రైవర్ అన్నారు. 'పురుషులకు కేటాయించిన సెక్షన్కు వెళ్లాలని ఎంత చెప్పినా మగవారు అర్థం చేసుకోవడం లేదు. మధ్య వయస్సు ఉన్న వారితోనే అసలు సమస్య వస్తుంది. ఆరోగ్యం బాగాలేదని కూర్చోవడానికి అనుమతించాలని మహిళల విభాగంలోనే ఉంటున్నారు. పెనాల్టీ లాంటిది ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండదు' అని ఓ మహిళా కండక్టర్ తెలిపారు.
ఇక సిటీ బస్సుల్లో తమ కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఊపిరి పీల్చుకుంటుంటే... మగవారు మాత్రం స్లైడింగ్ డోరు వ్యవస్థను జీర్ణించుకోలేకపోతున్నారు.