
హోలీ.. రంగుల పండుగ.
దేశమంతా ఉత్సాహంగా జరుపుకొనే ఈ వేడుకకు మార్కెట్లు రంగులతో కళకళలాడతాయి. వీధులన్నీ రంగులద్దుకుంటాయి. హోలీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సంప్రదాయం ఉండగా.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో పురుషులు మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉంటారు. స్త్రీలు స్వేచ్ఛగా హోలీ ఆడుకుంటారు. ఈ ఆసక్తికర ఆచారం 500 ఏళ్లుగా కొనసాగుతోంది.
ధిక్కరిస్తే బహిష్కరణే...
ఈ సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. 500 ఏళ్లుగా గ్రామస్తులు ఆచారాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. మహిళలు బయట తిరగకుండా ఉంచిన పర్దా వ్యవస్థ నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని స్థానికులు చెబతారు. పురుషులు ఉండరు కాబట్టి మహిళలు స్వేచ్ఛగా వేడుకలు చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ధిక్కరించి పురుషులు గ్రామంలో ఉండిపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. వారిని వెంటనే గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇక పురుషులకు హోలీ పండుగే ఉండదా అంటే.. ఉంటుంది. కాకపోతే తరువాతి రోజు పురుషులు, స్త్రీలు కలిసి ఈ వేడుకలు జరుపుకొంటారు. కేవలం రంగులు జల్లుకోవడం కాదు.. పురుషులను స్త్రీలు కొరడాలతో కొట్టడంతో పుండుగ ముగుస్తుంది.
పురుషులు ఆలయానికి..
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో నాగర్ గ్రామంలో ఈ అసాధారణ సంప్రదాయం ఉంది. హోలీ రోజున ఉదయం 10 గంటలు కాగానే.. నాగర్‌కు చెందిన ఐదేళ్లు దాటిన పురుషులంతా గ్రామాన్ని వదిలి శివార్లలో ఉన్న చాముండేశ్వరీ దేవీ ఆలయానికి వెళ్తారు. అక్కడ జాతర చేసుకుంటారు. భక్తిగీతాలు వింటూ రోజంతా భక్తిశ్రద్ధలతో గడుపుతారు.
పురుషుల వేషధారణలో స్త్రీలు..
ఇంకేముంది ఊరంతా మహిళలదే. రోజంతా పండుగే. గ్రామాన్నంతా అలంకరించి రంగులు జల్లుకుంటూ శోభాయమానంగా మారుస్తారు. వయసుతో తేడా లేకుండా మహిళలంతా ఆనందోత్సహాల్లో మునిగిపోతారు. ప్రత్యేక ఆచారం కావడంతో అంతగా ఇష్టపడనివారు సైతం కచి్చతంగా హోలీ ఆడతారు. కొందరు స్త్రీలు పురుషుల వేషధారణతో వేడుకల్లో పాల్గొంటారు.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment