Holi Festival 2023: Each Colour Has Different Meaning Secrecy - Sakshi
Sakshi News home page

హోలీ పండుగ: ఒక్కో రంగులో ఒక్కో భావం.. ఒక్కో రహస్యం కూడా!

Published Sun, Mar 5 2023 1:25 PM | Last Updated on Sun, Mar 5 2023 3:57 PM

Holi Festival 2023: Each Colour Has Different Meaning Secrecy - Sakshi

హోలీ పండుగ పూట రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ రంగు వెనకాల ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. హోలీలో వాడే ప్రధాన రంగుల గురించి పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించి ప్రస్తావన ఉంది.   

ఎరుపు: ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి ‘హోలీ’ ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం.  సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు.  పైగా ఎరుపు ఏకాగ్రతను ఆకర్షిస్తుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

గులాబీ: ప్రేమను తెలియజేసే రంగు ఇది. లేత గులాబి రంగుతో ఆనందం వెల్లివిరిస్తుంది. మనిషికి మధురమైన భావనలను కలిగిస్తుంది. గులాబీ, నలుపు రంగును మేళవిస్తే  ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. హోలీలో గులాబీ రంగుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారు.  

పసుపు: ఆధ్యాత్మిక ధోరణిలో పసుపు పవిత్రతకు సూచిక. శక్తికి, వెలుగుకు ప్రతీక. తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది.  అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. 

కాషాయం: ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. 

నీలం: దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు. ప్రశాంతత, నెమ్మదితనాలను సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుందని.. తద్వారా  జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చని  పెద్దలు చెప్తారు.    

ఆకుపచ్చ:  ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక.  అలిసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అందిస్తుంది.  

ఊదా: పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం.  నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రాజసమైనది. మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది. 

నలుపు:  రహస్యానికి గుర్తుగా నలుపు రంగును అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే.  ఈ రంగు మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement