హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! | - | Sakshi
Sakshi News home page

హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!

Published Tue, Mar 26 2024 1:15 AM | Last Updated on Tue, Mar 26 2024 8:47 AM

- - Sakshi

నదికి వెళ్లే ముందు స్నేహితులతో కమలాకర్‌, సంతోష్‌ సెల్ఫీ

నలుగురిని మింగిన నది

స్నానానికి వెళ్లి మృత్యువాత

అందరూ 25ఏళ్ల లోపు వారే..

మరణంలోనూ వీడని స్నేహం

హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్‌ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

ఉత్సాహంగా హోలీ చేసుకుని..
కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్‌(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్‌(25), ఎల్ములె ప్రవీణ్‌(23), మేడి నవీన్‌, పసుల సంతోష్‌ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్‌ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు.

మద్యం తాగి స్నానానికి దిగి..
ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్‌ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్‌ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్‌, ఉప్పుల సంతోష్‌, ప్రవీణ్‌, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు.

గమనించిన సంతోష్‌ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు.

ప్రమాదానికి కారణాలివే..
నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ
తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్‌, డీఎస్పీ కరుణాకర్‌ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్‌ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.

మిన్నంటిన రోదనలు..
యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్‌ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్‌ కొడుకా..’ అంటూ కమలాకర్‌ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది.

మృతుల వివరాలు..

  • ఆలం శంకర్‌–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు.
  • ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్‌. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్‌ పూర్తి చేసిన సంతోష్‌ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.
  • పనస వసంత్‌ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు.
  • వాసుదేవ్‌ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్‌. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్‌ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్‌ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్‌ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్‌(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు.

ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement